పీడిత దేశాలలోని జాతీయ ఉద్యమాలు బూర్జువా స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ 1917 అక్టోబరు మహా విప్లవం విజయం ప్రభావం వాటిపై పడింది. వలస దేశాలలో కమ్యూనిస్టు పార్టీల స్థాపన కోసం ఇచ్చిన పిలుపుతో ప్రేరణ పొందిన ఎంఎన్ రారు తాష్కెంట్ చేరుకున్నాడు. అప్పటికి అక్కడ భారత దేశం నుంచి వచ్చిన ముస్లిం ప్రవాసులు (ముహజిర్‌లు) అనేకులు ఉన్నారు. కమ్యూనిజం వైపు రావాల్సిందిగా వారిలో కొంత మందికి నచ్చచెప్పడం జరిగింది. ఆ విధంగా 1920 అక్టోబరులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది.
సోషలిస్టు ప్రాపంచిక దృక్పథం పట్ల విశ్వాసం కలిగి ఉన్న అన్ని శక్తుల కలయికయే 'వామపక్షం' అని జాతీయోద్యమ చరిత్రలోనూ, వర్తమాన రాజకీయ వ్యవహారాల్లోనూ నిర్వచించడం జరిగింది. ఈ కూటమిలో మార్క్సిజానిది తిరుగులేని ప్రభావం. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం సాగించే పోరాటం గురించి మార్క్స్ కొన్ని సైద్ధాంతిక రచనలు చేశాడు. అవన్నీ భారత్‌లో పెట్టుబడిదారీ విధానం పనితీరు, శ్రమ దోపిడీ గురించి వివరించేవే. దేశీయంగా స్వాతంత్య్రోద్యమం ప్రారంభం కావడానికి ముందే భారత జాతీయ విముక్తి ఆవశ్యకత గురించి మార్క్స్ నొక్కి చెప్పాడు. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు) ను సమర్థిస్తూ మార్క్స్, ఎంగెల్స్ న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్‌లో వ్యాసాలు రాశారు. తిరుగుబాటుదారులను సమర్థిస్తూ, బ్రిటిష్ వారి కిరాతక కృత్యాలను ఖండించారు. కారల్ మార్క్స్ 1883లో కన్ను మూశాడు. ఆ తరువాత కొద్ది కాలానికే రెండు ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అటు భారత జాతీయ తత్వం, ఇటు అంతర్జాతీయ సోషలిజమూ నిర్మాణ రూపాన్ని సంతరించుకున్నాయి. 1885 డిసెంబరులో భారత జాతీయ కాంగ్రెస్ ముంబయిలో ఆవిర్భవించింది. దీనిని బ్రిటిష్ రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారి అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ స్థాపించాడు.
అటు భారత జాతీయతత్వం, ఇటు అంతర్జాతీయ సోషలిజమూ నిర్మాణ రూపాన్ని సంతరించుకుంటున్న కాలమది. 1889లో రెండవ ఇంటర్నేషనల్ పారిస్‌లో ఏర్పడింది. ఇది ఐరోపా, అమెరికాలలోని కార్మికవర్గ ఉద్యమానికి చెందిన అనేక పురోగామి సెక్షన్లను తన పతాకం కింద సమీకరించింది.కాంగ్రెస్ మధ్యేవాద, చట్టబద్ధ రాజకీయాల చుట్టూనే తిరుగాడగా, రెండవ ఇంటర్నేషనల్ మితవాద సోషల్ డెమొక్రాట్ల ప్రాబల్యంలో ఉండేది. అందువల్ల ఈ రెండు ఉద్యమాలు దూరం దూరంగానే ఉండిపోయాయి. ప్రవాసంలో ఉన్న విప్లవకారులతో స్నేహ సంబంధాలు కలిగిన మేడం కామా స్టట్ గార్ట్ ఇంటర్నేషనల్ మహాసభ(1907)నిర్వహించారు. స్వేచ్ఛా భారత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని (ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ) ఆ సమావేశ స్థలి వద్ద ఎగరవేశారు. ఆ మహాసభలో వామపక్షాలకు, మధ్యేవాదులకు మధ్య కుదిరిన పొత్తు పరిమితమైనది. 1917 అక్టోబరు మహా విప్లవం తరువాత జాతీయ విముక్తి ఉద్యమాల్లో సోషలిస్టు భావాలు పెరగనారంభించాయి. పీడిత దేశాలలోని జాతీయ ఉద్యమాలు బూర్జువా స్వభావాన్ని కలిగి ఉన్నా, అక్టోబరు విప్లవం విజయం తరువాత సోషలిజం భావజాలం చాలా ఉద్యమాలను ప్రేరేపితం చేసిందని లెనిన్ పేర్కొన్నాడు.

వలస దేశాలలో కమ్యూనిస్టు పార్టీల స్థాపన కోసం ఇచ్చిన పిలుపుతో ప్రేరణ పొందిన ఎంఎన్ రాయ్ తాష్కెంట్ చేరుకున్నాడు. అప్పటికి అక్కడ భారత దేశం నుంచి వచ్చిన ముస్లిం ప్రవాసులు (ముహజిర్‌లు) అనేకులు ఉన్నారు. కమ్యూనిజం వైపు రావాల్సిందిగా వారిలో కొంత మందికి పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా 1920 అక్టోబరులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. దీని ప్రధాన కార్యాలయం రారుతోపాటు తిరుగుతూ ఉండేది. విదేశాలలో శిక్షణ పొందిన కమ్యూనిస్టులను భారత్‌కు పంపడానికి ఆయన నిరంతరం కృషి చేశాడు. అయితే వీరు ప్రభుత్వానికి చిక్కి, దారుణ శిక్షలకు గురయ్యారు. ఇది పెషావర్ కుట్ర కేసు(1921-23)గా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఈ తొలి ప్రయత్నాలు ఫలించకపోయినప్పటకీ భారత దేశంలో వామపక్ష ఉద్యమాల ఆవిర్భావంలో వీటి పాత్ర విస్మరించరానిది.
భారత దేశంలో స్వాతంత్రం విషయంలోనూ, అదే విధంగా ఖిలాఫత్ ఉద్యమం (1920-22) లోను జాతీయోద్యమం, సోవియట్ రష్యా ఒకే పక్షాన నిలిచాయి.
ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధంలో సంకీర్ణ దళాల చేతిలో ఓటమి తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యానికి, నాలుగు సంకీర్ణ రాజ్యాలు ( బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ)కు మధ్య కుదిరిన 'సెవెరెస్ ఒప్పందం' ఒట్టోమన్ సామ్రాజ్య భూ భాగాన్ని బాగా కుదించివేసింది. ఒట్టోమన్ సుల్తాన్ ( ఆయననే ఖలీఫ్ అని కూడా అంటారు) అధికారాలను హరించివేసింది. దీనికి ప్రపంచ వ్యాపితంగా ముస్లింల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్‌లోనూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు తలెత్తాయి. వీరికి మద్దతుగా గాంధీ సత్యాగ్రహ యాత్ర నిర్వహించాడు.బ్రిటిష్ సైన్యంలో చేరేందుకు తిరస్కరించడం, పన్నులు చెల్లించ నిరారకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. హిందువుల నుంచి కూడా మద్దతు లభించింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారత దేశంలో హిందూ, ముస్లింలను ఐక్యపరిచేందుకు ఖిలాఫత్ ఉద్యమం తోడ్పడింది. అయితే, ఈ ఉద్యమానికి మద్దతిచ్చినందుకు మితవాదులు కొందరు గాంధీజీని విమర్శించారు. సోవియట్ రష్యా కూడా మద్దతు పలకడంతో జాతీయోద్యమ నాయకుల్లో సోవియట్ పట్ల సానుకూలత పెరిగింది.
జాతీయోద్యమంలోకి కార్మికులను, కర్షకులను తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి గయా కాంగ్రెస్ (1922)లో సి.ఆర్. దాస్ చేసిన అధ్యక్షోపన్యాసంలో వ్యక్తమైంది. 1924లో జైలు నుంచి విడుదలైన గాంధీజీ సంపూర్ణ సమానత్వ వాదాన్ని ప్రబోధిస్తూ ఐచ్ఛిక సార్వజనీన ఓటింగ్ హక్కును డిమాండ్ చేశారు. యంత్ర పరిశ్రమలపై ప్రభుత్వ యాజమాన్యం ఉండాలని పేర్కొన్నారు. 1925లో తాను నడుపుతున్న 'యంగ్ ఇండియా' పత్రికలో ఎంఎన్ రారు వ్యాసాన్ని ప్రచురించారు. హోం రూల్ అన్న అస్పష్ట భావన స్థానంలో స్వాతంత్య్రం అన్న భావనను 1923 నుంచి జవహర్‌లాల్ నెహ్రూ స్వీకరించారు. 1934-35లో 'సోషలిజం, కమ్యూనిజం వైపునకు సుదీర్ఘ ప్రయాణం' అన్న వ్యాసాన్ని రాస్తూ, 'నా మనసులోని చీకట్లను మార్క్సిజం అనే వెలుగు పారద్రోలింది' అని ఆయన చెప్పుకున్నారు. సోషలిజం వైపు ఈ రకమైన మొగ్గుదలే విప్లవకారులలోనూ కనిపిస్తుంది. 1926లో 'నవ జవాన్ భారత్ సభ' ను స్థాపించినప్పుడే సోషలిజం పట్ల భగత్‌సింగ్‌కు ఉన్న విశ్వాసం వెల్లడైంది. 1928లో చంద్ర శేఖర్ అజాద్, భగత్‌సింగ్ నేతృత్వంలో దేశంలోని విప్లవ బృందాలన్నీ ఢిల్లీలో సమావేశమైనప్పుడు తమ సంస్థ పేరును హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ సమాఖ్యగా మార్పు చేశారు. 1913లో ప్రారంభమైన గదర్ ఉద్యమం వంటివి సోషలిస్టు భావనతో ప్రేరేపితమైనవే. అయితే వీటిలో కొన్ని పరిమితులు ఉండవచ్చుగాక. ఏది ఏమైనప్పటికీ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు తొలుత వీరి నుంచే పుట్టుకొచ్చారు.











