Oct 04,2023 08:33
  • తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టాలి
  • ఎన్‌ఐఎ దాడులకు ఖండన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెంచిన విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల మూలంగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. మంగళవారం విజయవాడలోని దాసరి భవన్‌లో సిపిఐ (ఎంఎల్‌) నాయకులు జె కిషోర్‌బాబు అధ్యక్షతన వామపక్ష పార్టీల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌, వి ఉమామహేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, నాయకులు డి హరినాథ్‌ ( సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌)), పి ప్రసాద్‌ ( సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), ఎస్‌కె ఖాదర్‌ బాషా (ఎంసిపిఐ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ భారాలు, కరువు, ఉద్యోగుల ఆందోళనలు తదితర అంశాలను వామపక్ష పార్టీలు చర్చించి పోరాటాలకు కార్యాచరణను రూపొందించాయి. విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కొనసాగింపుగా ఈ నెల 9 నుంచి 15 వరకు కరపత్రాలను పంపిణీ చేయాలని, పేటలు, వీధుల్లో సమావేశాలు, ప్రజా బ్యాలెట్‌లు నిర్వహించి ప్రజల వ్యతిరేకతను కూడగట్టాలని నిర్ణయించాయి. విద్యుత్‌ భారాలపై జిల్లాల్లోనూ వామపక్షాలు సమావేశమై పోరాటాలకు కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లపై, దేశవ్యాప్తంగా మీడియా సంస్థలపై సోదాల పేరుతో ఎన్‌ఐఎ జరిపిన దాడులను సమావేశం ఖండించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు, ఉపాధ్యాయు లకు పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసును క్రమబద్ధీకరించాలని సమావేశం డిమాండ్‌ చేసింది.