Apr 22,2023 12:59

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనను ఐక్యంగా పోరాడి ఎండగడదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి , సిపిఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు పిలుపునిచ్చారు. శనివారం సఖినేటిపల్లి గొంది గ్రామంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం మాల్యాద్రి మాట్లాడుతూ ... దేశంలో బిజెపి ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలను సమస్యల్లో నెట్టి వేస్తోందన్నారు. బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజలకు తెలియజేసి చైతన్యం తీసుకొచ్చేందుకు నేటి నుంచి 27వ తేది వరకు రాజకీయ ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాల్యాద్రి మాట్లాడుతూ .... మోడీ ప్రభుత్వం విధానాలు పెను ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపారు. ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపి, భారతదేశాన్ని కాపాడాలని కోరారు. గ్యాస్‌ ,పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసర వస్తువులు, మందుల ధరలను రోజురోజుకు పెంచుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు శరవేగంగా పరుగులు పెడుతుందని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె సత్తిరాజు మాట్లాడుతూ ... ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కారు చౌకగా బిజెపి దారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. ఆంధ్రుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మబోతున్న బిజెపి సర్కార్‌ 8 బడ్జెట్లలో రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహించారు. ప్రత్యేక హౌదా, విభజన హామీ చట్టాలను తుంగలో తొక్కిన కేంద్ర ప్రభుత్వంపై వైసిపి, టిడిపి, జనసేన నోరు మెదపడం లేదన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పీతల రామచంద్ర రావు మాట్లాడుతూ ... మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనం దేశానికి తీసుకొచ్చి పేదలకు పంచిపెడతామని మాటలకే పరిమితం అయ్యారని తెలిపారు. నోట్లు రద్దుచేసి ప్రజలకు మంచి రోజులు వస్తాయని నమ్మించారని, అదానీ, అంబానీ వంటి ధనవంతులకు మంచి రోజులు వచ్చాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పీతల రామచంద్ర రావు, సిపిఐ ఎరియా కన్వీనర్‌ దేవా రాజేంద్రప్రసాద్‌, మహిళ సంఘం జిల్లా కార్యదర్శి వరలక్ష్మి, చవ్వాకుల సూర్యప్రకాశరావు, తాడి శ్రీరాముర్తి, పుల్లేశ్వరావు, ఆనంద్‌, వెంకట్‌, పలువురు పాల్గొన్నారు .