అమిత్ కిషన్ ...బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి రైతుగా మారాడు. సహజ వ్యవసాయాన్ని చేపట్టి, పశువులు పెంచుకుంటూ సాధారణమైన రైతు జీవితాన్ని గడుపుతున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికసాయం చేస్తున్నారు. మంచి ఉద్యోగం చేయాలన్న పట్టుదలతో చదువుకున్న తాను రైతుగా అడుగు వేయడానికి గల కారణాన్ని తన మాటల్లోనే విందాం.
' మా'ది శ్రీ సత్యసాయి జిల్లా. పెనుకొండ. వ్యవసాయాధారిత కుటుంబం. మా నాన్నా, తాతయ్య పొద్దున లేచిన దగ్గర నుంచి పొలాల్లో పనులకు వెళ్లేవారు. నన్ను, అన్నయ్యను బాగా చదివించారు. చదువుకుని బెంగుళూరులో టాప్ కార్పొరేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో పది సంవత్సరాలు ఉద్యోగం చేశా. మంచి జీతం. ఉదయాన్నే ఆఫీసుకు బయల్దేరి వెళతా. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయ్యేది. బాగా అలిసిపోయేవాడిని. మానుకోవాలనిపించేది. వెనక్కి రావాలంటే అవమానంగా చూస్తారేమో అని ఆగిపోయేవాడిని. చదువుకున్నాం కదా! ఈ బ్యాంకు ఉద్యోగం ఎందుకు వదులుకోవాలి అని మనసుకు చెప్పుకునేవాడిని. కొన్నాళ్లకు యాంత్రికం అయ్యింది. నాతో కలిసి పనిచేసే ఓ స్నేహితుడు క్యాన్సర్‌తో బాధపడుతూ, సంవత్సరం తర్వాత చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందని వివరాలు తెలుసుకున్నా. కలుషితమైన ఆహారం, రసాయనాల వల్ల అని చెప్పారు. చాలా రోజులు ఆలోచించా. ఎంత సంపాదించినా తృప్తి కలగడం లేదు. ఇలా కలుషితమైన గాలి పీలిస్తూ, రోడ్ల మీద తిరుగుతూ అక్కడ ఉండాలనిపించలేదు. బాల్యం గుర్తొచ్చింది. పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య, స్వచ్ఛమైన గాలి, గడ్డ పెరుగు, బాల్య స్నేహితులు... ఇలా ఎన్నో ఆలోచనలు నిద్రపట్టనివ్వలేదు. వెంటనే ఇంటికి తిరిగి వచ్చా.
రైతులు నవ్వారు ...
ఇంట్లో నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అన్న, వదిన పిల్లలు, అత్త, బావలు ఇలా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నాకు తిరిగి ఉద్యోగానికి వెళ్లాలని అనిపించలేదు. వ్యవసాయం చేస్తానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కాని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు. అలా ఏడేళ్ల క్రితం సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించా. మా పక్క పొలాల్లో రైతులు మిర్చి పండిస్తే మేం వేరశనగ పండిస్తాం. మొదట ఖరీఫ్, రబీ సీజన్లు వచ్చే ముందు పొలంలో ఏం చేయాలో తెలిసేది కాదు. దాచుకున్న డబ్బు అంతా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టా. ట్రాక్టర్ వినియోగించకుండా ఎద్దులతో దున్ని విత్తనాలు వేశా. రసాయన మందులు చల్లలేదు. అది చూసి 'నీకు వ్యవసాయం చేయడం రాకపోతే. మానుకో' అని నవ్వారు. అయినా పట్టువదలకుండా సేంద్రియ మందులతో కూరగాయలు పండించా. పాల ఉత్పత్తుల కోసం లక్షలు ఖర్చుపెట్టి మంచి విత్తనం గల పాడి గేదెలను కొనుగోలు చేశా. కల్తీ లేని పాలు అమ్ముతున్నామని తెలిసి పక్క ఊర్ల నుంచి వచ్చి మరీ కొనుగోలు చేశారు. స్వచ్ఛమైన నెయ్యి కూడా వచ్చేది. పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబిస్తూ కూరగాయలు పండిస్తున్నామని జనం ఆసక్తి కనబరిచేవారు. పొలం దగ్గరకు వచ్చి మరీ కొనుగోలు చేసేవారు. దాంతో ఒక ఫారమ్ ప్రారంభించాలని నిర్ణయించా. దానికి అన్నయ్య సహకారం తీసుకున్నా. వినియోగదారులకు సేంద్రియ, తాజా కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం 'అమిత్ హెబ్బేవు ఫారమ్' ప్రారంభించా. ఫారమ్‌లో, పంట పొలాల్లో పనిచేసేందుకు సుమారు వంద మంది మహిళలు వస్తున్నారు. వారికి ఉపాధి చూపుతున్నా. ఇప్పుడు నాకు లాభం కన్నా కుటుంబానికి తగ్గ ఆదాయం వస్తుంది. డబ్బు వెంట పరుగు తీయడం లేదు. ఆ పచ్చని పొలాలు, పశువులను చూస్తూ జీవితం గడుపుతుంటే చాలా తృప్తిగా ఉంది.' అంటారు అమిత్ కిషన్.










