Jun 15,2023 06:50

'ముగ్గురూ ఆడపిల్లలే.. జాగ్రత్తగా ఉండండి.. త్వరగా పెళ్లిళ్లు చేసి పంపండి' అన్న మాటలు వింటూ పెరిగిన ఆమె పేరు ప్రీతీ విశ్వకర్మ. ముంబయిలో పుట్టి పెరిగిన ప్రీతీ ఆ ముగ్గురు ఆడ పిల్లల్లో ఆఖరిది. బంధువులు, ఇరుగుపొరుగు వారు సూటిపోటు మాటలు అన్న ప్రతిసారీ ''ఆడపిల్లలను కలిగిఉండం వల్ల మాకు బాధగా లేదు.. ఎంతో గర్వంగా ఉంద''న్న తల్లిదండ్రుల మాటలు ఆమెలో ఎక్కడ లేని ధైర్యాన్ని నింపేవి. అందుకే ఎంతటి ప్రతికూల పరిస్థితులోనైనా తనను తాను నిరూపించుకుంటూ ముందుకెళుతోంది.
'పెళ్లి చేసుకోవడం మీ లక్ష్యం కాదు.. స్వతంత్రంగా బతకడమే మీ ధ్యేయంగా ఉండాలి' అని నాన్న మాతో పదే పదే చెప్పేవారు. అమ్మానాన్న మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మేము ఉన్నత శిఖరాలవైపు ప్రయాణించేలా చేయడంలో వారి కృషి ఎంతో ఉంది' అంటున్న ప్రీతీకి కళారంగంపై ఉన్న మక్కువతో టెలివిజన్‌ ప్రొడక్షన్‌ కోర్సు చేసి ప్రముఖ టీవీ కంపెనీలో అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వివిధ చిత్రనిర్మాణాల్లో పాల్గొన్నారు. 'ఈ రంగంలో ఉండడం వల్ల అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఏ టైమ్‌కి పడితే ఆ టైమ్‌కి స్టూడియోకి వెళ్లడం, రావడం చేసేదాన్ని. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఉదయం 5 గంటలకే వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పనిగంటలు నా ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. 16 ఏళ్లప్పుడు నాకు మూర్ఛవ్యాధి సోకింది. అప్పుడు కూడా అమ్మానాన్న నాకు అండగా నిలబడ్డారు. నాలో లేనిపోని భయాలు కలగకుండా ధైర్యంగా ఉండమనేవారు.

2
  • ట్రావెలర్‌.. జీవితంలో కొత్త దారి

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రీతీ విశ్రాంతి కోసం ఏదైనా ట్రిప్‌ చేయాలనుకున్నారు. అలా మొదటిసారి ఉత్తరాఖండ్‌ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. 'ఈ ట్రిప్‌కి మా ఫ్రెండ్స్‌ని రమ్మన్నాను. కాని ఉత్తర భóారతదేశ ప్రయాణం ఆడపిల్లలకు అంత శ్రేయస్కరం కాదని వారు రానన్నారు. కానీ నా నిర్ణయం మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నాన్నకు అబద్దం చెప్పి ఒక్కదాన్నే ట్రిప్‌కు బయలుదేరాను' అంటున్న ప్రీతీ 23 ఏళ్ల వయసులో మొదటిసారి ముంబయి నుండి బయటికి వచ్చింది.
'ముంబయి నుండి ఛండీగఢ్‌కు రైలులో ప్రయాణించాను. రాత్రి 10 గంటలకు రైలు దిగితే 11 గంటలకు ధర్మశాలకు బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ఆ గంట స్టేషనులో ఉండేందుకు చాలా భయమేసింది. కానీ అక్కడ నాతోపాటు మరో విదేశీ మహిళ కూడా ఉంది. ఆమెను చూసి నాకు చాలా ధైర్యమనిపించింది. ఎవరో పరాయి దేశ మహిళ ఇంత ధైర్యంగా ఉంటే.. నా సొంత దేశంలో నేనెందుకు భయపడుతున్నాను అనిపించి గుండెనిబ్బరంగా అక్కడే నుంచొన్నాను. అయితే ఆ భయం వెనుక నాలో ఏదో అసంతృప్తి. నాన్నకు అబద్దం చెప్పి వచ్చాను కదా! అందుకే ట్రిప్‌ ముగించుకుని వెళ్లగానే నాన్నకు నిజం చెప్పేసి క్షమించమని కోరాను. అప్పుడు 'జాగ్రత్తగా ఉండు.. నీపై నాకు, అమ్మకు చాలా నమ్మకం' అని నాన్న చెప్పిన మాటలు నాలో మరింత ధైర్యాన్ని నింపాయి'.

  • వెనుదిరిగి చూడలేదు..

ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నంత కాలం అమ్మానాన్న ఇచ్చిన ధైర్యం వెలకట్టలేనిది. వారు చెప్పిన మాటలే నా జీవితాన్ని మరో దిశలో నడిపించాయి. అలా 2014లో ఒంటరిగా మొదలుపెట్టిన నా ప్రయాణం ఇప్పటివరకు ఆగలేదు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి ఉత్తరభారత రాష్ట్రాలన్నీ ప్రయాణించేశాను. ఈ ప్రయాణాల్లో నేను పొందిన సంతోషం దేనిలోనూ కలగలేదు. అందుకే చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి సమయమంతా ట్రావెలర్‌గానే ఉండిపోయాను' అంటున్న ప్రీతి ఆ తరువాత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల మహిళల కోసం ఓ ట్రావెలర్‌ గ్రూపు ప్రారంభించారు.

  • 50, 60 ఏళ్ల మహిళల కోసం..

'మహిళలు చాలా ఏళ్ల పాటు కుటుంబానికే అంకితమవుతారు. వృద్ధాప్యం వచ్చాక విరామం వచ్చినా ఏదైనా ప్రయాణం చేయాలంటే సహకారం వుండదు. అటువంటి వారందరినీ నా గ్రూపులో చేర్చుకున్నాను. నా గ్రూపులో ఇప్పుడు 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వయసు వారు ఉన్నారు. ఒకరికొకరు ఏ పరిచయం లేకపోయినా మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాం. కొండలెక్కుతాం.. పర్వతాలు అధిరోహిస్తాం. 'వరుసగా ఆడ పిల్లలు పుట్టారు..' అని విచారం చేసిన బంధువులంతా ఇప్పుడు నా గ్రూప్‌లో చేరి నాతో పాటు ప్రయాణిస్తుంటే చెప్పలేని సంతోషమేస్తోంది. వారిని చూసినప్పుడల్లా.. స్వతంత్రంగా జీవించడం ముఖ్యమ'ని నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి.