Sep 27,2023 20:28
  • కొద్దిసేపు విధులు బహిష్కరించిన న్యాయవాదులు
  • విజయవాడ కోర్టుల వద్ద నిరసన

ప్రజాశక్తి - విజయవాడ : రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ సివిల్‌ కోర్టుల వద్ద న్యాయవాదులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఎఎల్‌) రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు న్యాయవాదులు కొద్దిసేపు తమ విధులను బహిష్కరించారు. అనంతరం సివిల్‌ కోర్టుల సముదాయం ఎదుట ధర్నా చేశారు. ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా (ఐఎఎల్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ న్యాయవాది చలసాని అజయ్ కుమార్‌ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమ నిధి కింద ఇవ్వాల్సిన రూ.75 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, సంక్షేమ నిధిని రూ.12 లక్షలకు పెంచాలని, మరణించిన వారి కుటుంబాలకు చెల్లించాల్సిన పెండింగ్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ.30 కోట్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్‌ కార్డు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యువ న్యాయవాదులను గుర్తించి లా నేస్తం నిధులు ప్రతి నెలా అందించాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెబి సుందర్‌ మాట్లాడుతూ నగరంలో కోర్టులకు ఆధునిక భవనాలు నిర్మించినా వాటిల్లో విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేవన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులు హేయమైనవన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జున్ను శ్రీధర్‌, ఐఎఎల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవివి పరమేశ్వరరావు, కె సుధాకర్‌ రాజు, ఉప ప్రధాన కార్యదర్శి ఎంఎ షరీఫ్‌, ప్రతినిధులు ఎన్‌ సాయి శంకర్‌, ఇఎస్‌ ప్రసాద్‌, పి గిరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.