- ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుంటున్న కేంద్రం విద్యుత్‌ను కూడా తన ఆధీనంలోకి తీసుకుంటోంది. దీనిలో భాగంగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2022ను తీసుకొచ్చింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్టులో 176 సెక్షన్‌లో 2005లో కొన్ని రూల్స్‌ను చేర్చింది. ఇప్పుడు కొత్తగా వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దీన్ని ఎలక్ట్రిసిటీ (సవరణ) చట్టం 2022గా పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు 12వ తేదీన డ్రాఫ్ట్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ లోపు దీనిపై అభిప్రాయాలు పంపించాలని అన్ని రాష్ట్రాలను, వాణిజ్య, వ్యాపార సంఘాలతోపాటు, విద్యుత్ పంపిణీ, తయారీ సంస్థలను ఆదేశించింది. ఇక నుండి విద్యుత్ కొనుగోలు పంపిణీకి అయ్యే ఖర్చును నెలవారీ వసూలు చేయనున్నారు. అంటే ఇప్పటి వరకూ పెట్రోలు, డీజిల్ మాదిరి ఏ నెలకానెల బిల్లుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇది వినియోగదారులపై పెనుభారం మోపనుంది. ఇప్పటి వరకూ ట్రూ అప్ ఛార్జీలను రాష్ట్ర కమిషన్ మూడు నెలలకు రెగ్యులేటరీ అప్రూవల్ జరిగిన తరువాతే అమలు చేస్తోంది. ఇక ముందు వార్షిక ధరల నిర్ణయం ఆధారంగా నెలవారీ పద్ధతిలో వినియోగదారులపై వేయనున్నట్లు చెబుతోంది. ఒకనెలలో ట్రూ అప్ భారమైతే దానిలో కొంత భాగాన్ని తరువాత నెలలోకి మార్చుకునే (క్యారీఫార్వార్డ్) అవకాశం కల్పించింది. అయితే అది రెండు నెలలకు మించకూడదని చట్టంలో పేర్కొన్నారు. నిర్దేశించిన ఛార్జీల్లో 20 శాతం కంటే అదనంగా ధర పెరిగితే అదే ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా వసూలు చేసుకునే అవకాశమూ కల్పించారు. ట్రూఅప్ కింద వసూలవుతున్న మొత్తాన్ని ముందుగా పాత బకాయిగానే జమచేయనున్నారు.










