- ఇండస్ పేరుతో విడుదల
- తొలి ఏడాది డెవలపర్లకు ఉచితం
- గూగుల్ ప్లే, ఆపిల్‌లకు పోటీగా అభివృద్థి
న్యూఢిల్లీ : యాప్ స్టోర్లలో గుత్తాదిపత్యం కలిగిన గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లకు పోటీని ఇవ్వడానికి ప్రముఖ చెల్లింపుల వేదిక సంస్థ ఫోన్ పే రంగంలోకి దిగింది. కొత్తగా యాప్ స్టోర్‌ను అభివృద్థి చేసింది. తన సేవల విస్తరణలో భాగంగా యాప్ సేవల కోసం సొంతంగా 'ఇండస్ యాప్ స్టోర్' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ స్టోర్‌లో భారత్ యాప్ డెవలపర్లు తమ యాప్స్‌ను రిజిస్టర్ చేసుకుని ఉచితంగా అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. 13 భాషల్లో యాప్ స్టోర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
2015లో ఆకాశ్ డోంగ్రే, సుధీర్ బి, రాకేశ్ దేశ్‌ముఖ్ అనే ఐఐటియన్ల ఆలోచనలతో 'ఇండస్ యాప్' స్టోర్ రూపుదిద్దుకుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చేయూత ఇవ్వడానికి.. వారి చాయిస్‌కు అనుగుణంగా కంటెంట్ అందించేందుకు 'ఇండస్ ఒఎస్' అనే యాప్ కంటెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఇ-కామర్స్ సంస్థ వాల్‌మార్ట్ అనుబంధ సంస్థగా ఉన్న ఫోన్‌పే రూపొందించిన 'ఇండస్ యాప్' స్టోర్‌కు సాంసంగ్ వెంచర్ క్యాపిటల్ ఆర్మ్ మద్దతు అందిస్తోంది. యాప్ డెలవపర్లు ఏడాది తర్వాత స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. యాప్స్ డెవలపర్స్ నుంచి ప్లాట్ ఫామ్ ఫీజు లేదా చార్జీ వసూలు చేయబోవడం లేదని ఫోన్ పే తెలిపింది. యాప్ డెవలపర్లు తమకు నచ్చిన పేమెంట్ గేట్‌వేను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ గానీ, ఆపిల్ యాప్ స్టోర్ గానీ అన్ని యాప్‌లను అనుమతించడం లేదు. యాప్‌లు రూపొందించిన డెవలపర్ల నుంచి ప్రతియేటా 15-25 శాతం ఫీజు వసూలు చేస్తున్నాయి. గూగుల్, ఆపిల్ సంస్థలు పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎంచుకోకుండా డెవలపర్లను నియంత్రిస్తున్నాయి. దీంతో వీటిపై యాప్ డెవలపర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు తమ ఇండస్ యాప్‌స్టోర్ ప్రత్యామ్నాయం కాగలదని ఫోన్ పే పేర్కొంది.
'వచ్చే మూడేళ్లలో భారత్‌లో 100 కోట్ల మందికిపైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉంటారు. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ అండ్ స్థానిక ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నిర్మాణానికి మంచి అవకాశం ఉంది. భారీ మార్కెట్, యాప్ డెవలపర్లు ఉన్నా.. వారు తయారు చేసే యాప్స్ పంపిణీ చేయాలంటే ఏకైక మార్గం 'గూగుల్ ప్లే స్టోర్'పైనే ఆధార పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో భారతీయుల యాప్ డెవలపర్ల కోసం విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్ అందించగలమన్న ఆశాభావంతో ఉన్నాం.' అని ఇండస్ యాప్ స్టోర్ సహ వ్యవస్థాపకుడు, సిపిఒ ఆకాశ్ డోంగ్రే పేర్కొన్నారు. ఈ యాప్‌స్టోర్‌తో ప్రస్తుత గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతోన్న వేళ ఫోన్‌పే వాటికి సవాల్ విసరనుంది.