నేపాల్ : నేపాల్ లో శుక్రవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. నిన్న అర్థరాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో సుమారు 128 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అక్కడి స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు.
6.4 తీవ్రత...
రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.4 గా నమోదయింది. నేపాల్ లోని వాయువ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ ర్వే తెలిపింది. విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. సమాచార వ్యవస్థ కూడా పనిచేయడం లేదు. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ సంతాపం ప్రకటించారు. అర్థరాత్రి ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉంది.
జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం...
దేశ రాజధాని ఖాట్మండ్‌లో 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రుకమ్ జిల్లాలో ఇండ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అక్కడకు వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలో కూడా ప్రకంపనలు...
భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేపాల్ లోని భూకంప తీవ్రతకు భారత్ లోని బీమార్, యుపి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు కూడా కంపించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీలో కూడా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు రోడ్ల మీదకు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.