
టెక్నాలజీ పరుగులు తీస్తున్న కాలంలో... రోజుకో సాఫ్ట్‌వేర్ పుట్టుకొస్తుంది. ముఖ్యంగా దైనందిన జీవితంలో మొబైల్ వాడకం తప్పనిసరి అయ్యింది. ఫోన్ లేకపోతే పనే జరగదన్నట్టు ! ఎటు చూసినా ఫోన్లతో ప్రజలు బిజీగానే కనిపిస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సపోర్ట్ చేసే ర్యామ్‌కు తగ్గట్టే స్టోరేజీ ఉంటుంది. చిన్న స్క్రీన్‌ను చూస్తూనే వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్, యూట్యూబ్, ఫైల్స్ వంటివి చూస్తుంటాం. అయితే కంటికి ఒత్తిడి తగ్గిస్తూ ... ఎక్కువ ర్యామ్‌తో ఎక్కువ స్టోరేజీతో పెద్ద ఫోన్ లాంటి ల్యాప్‌టాప్ 'ప్రైమ్ బుక్ 4జీ ఆండ్రాయిడ్' తక్కువ ధరత్తో మార్కెట్లో విడుదలైంది. సింపుల్‌గా చెప్పాలంటే ... ల్యాప్‌టాప్‌లా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఇది ! వివరాల్లోకి వెళితే...

ఈనెల 11 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రెడీ...
కొత్త ప్రైమ్‌బుక్ 4జీ ల్యాప్‌టాప్ 4,000 ఎంఎహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగి, వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ వెబ్ క్యామ్ పొందుతుంది. ఇది ఈ నెల 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రెడీ అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను కొంటే రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 4జి సిమ్‌కు సపోర్ట్...
మార్కెట్లో విడుదలైన ఈ ప్రైమ్‌బుక్ 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్ బేస్ వేరియంట్ ధర కేవలం రూ.16,990 కాగా, 4 జీబీ ర్యామ్‌తోపాటు 128 జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.18,990. ఇది 4జీ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు, ఈ-లెర్నింగ్ వంటి వాటికోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. కాబట్టి విద్యార్థులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

200 జీబీ వరకు పెంచుకోవచ్చు....
ప్రైమ్‌బుక్ 4జీ ల్యాప్‌టాప్ హెచ్‌డీ రెజల్యూషన్ 11.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, కలిగి మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 200జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బరువు 1.2 కేజీలు. ఇందులో వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్‌బీ పోర్టులు, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, మినీ హెచ్‌డీఎంఐ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

విండోస్ అప్లికేషన్లు సపోర్ట్ చేయవు...
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ప్రైమ్‌బుక్ రన్ అవుతుంది, అయితే విండోస్ అప్లికేషన్లు ఈ ల్యాప్‌టాప్‌లో సపోర్ట్ చేయవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ల్యాప్‌టాప్ రూపంలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్. కాబట్టి 10 వేలకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి.