Jul 30,2023 11:07
  • ఇంకా ముంపులోనే లంక గ్రామాలు
  • సహయం కోసం లంక వాసులు ఎదురుచూపు

ప్రజాశక్తి- రాజోలు(కోనసీమ) : గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. శనివారం కంటే ఆదివారం వశిష్ఠ గోదావరి మరింత పోటెత్తింది. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూరగాయలు, అరటి తదితర తోటలు నీట మునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గ్రామాల వారీగా తహశీల్దారు స్థాయి అధికారులను నియమించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు వరద గ్రామాల్లో పర్యటించారు. .

  • లంక భూముల్లోకి వరద నీరు చేరడంతో తోటలు మునక

మరింత పెరిగితే ముప్పే.. వరద మరింత ఉద్ధతమై ఏటిగట్లను తాకి ప్రవహిస్తే ముప్పేనని ఏటిగట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజోలులోని కాటన్‌ పార్కు నుండి నున్న వారి బాడవ వరుక, దిండి, సఖినేటిపల్లి వరుకు గల తదితర గ్రామాల పరిధిలో ఏటిగట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. ముందు జాగ్రత్తగా గట్టు రక్షణకు ఏర్పాట్లు చేశారు. లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో వారి అవసరాల కోసం ఇంజిన్‌ బోట్లు, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు.

2
  • నిండుగా డ్రెయిన్లు.. ముంపులో వరి.. ఒక వైపు గోదావరి

పరీవాహక లంక భూముల్లో తోటలు ముంపు బారిన పడితే, వర్షాలకు మునకేసిన వరి చేలల్లో నీరు అలాగే ఉండిపోయింది. డ్రెయిన్లు పొంగి ప్రవహించడంతో లాగడం లేదు. కొన్నిచోట్ల నాట్లు వేసిన చేలతోపాటు ఆకు మడులు కుళ్లిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లో తోటలతోపాటు, వరి చేలకు నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు. .