ప్రాణి మనుగడకు ముఖ్యంగా కావల్సింది గాలి, నీరు, ఆహారం. గాలి ఉంటేనే ప్రాణి బతుకుతుంది. దానికి నీరు, ఆహారం అవసరమౌతాయి. సాహిత్యానికి కూడా అలాంటివే మూడు కావాలి. భాష, రూపం, వస్తువు. భాష ఉంటే నే సాహిత్యానికి బొమ్మ ఒక రూపం ఏర్పడుతుంది. రూపం పాఠకుడి మనసులో కడితేనే వస్తువు ప్రకటింపబడుతుంది. దీన్ని బట్టి వస్తువు కన్నా, రూపానికన్నా భాష ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. భాషే మన ఐడి కార్డు. భాషను మించిన ఐడెంటిటీ కార్డు మనకు ఇంకొకటి లేదు. సూది వెంట దారంలా భాష వెంట సంస్కతి, సంప్రదాయాలు, జీవన విధానం వగైరా అన్న వాటంతట అవే సాహిత్యంలో వచ్చి చేరతాయి. అయితే ఇప్పుడు వాటిని కొంచెం ఎడిట్ చేసుకోవాల్సిన తరుణం వచ్చింది.
సాహిత్యంలో భాషను, యాసను నిలుపుకోవడమంటే మన తల్లి పాల తీయదనాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు.. మన మట్టి వాసనను మనం ఎలుగెత్తి చాటుకున్నట్టు. రెప రెపమనే మన జెండాని మనం ఎగరేసుకున్నట్టు! మన చిరునామా మనం సరిగా చెప్పుకున్నట్టు. భాషే మూలం. యాసే కేంద్రకం. ఫలానా జిల్లా వాణ్ణి అని చెపితే చిరునామా పూర్తిగా చెప్పినట్లు కాదు. ఇంకా లోతుల్లోకి, మూలాల్లోకి వెళ్ళాలి. ఏ మండలమో, ఏ గ్రామమో, ఏ వీధో చెపితే గానీ మన చిరునామా పూర్తి కాదు. చిరునామాని విశ్లేషించి చూస్తే అది మన వర్గాన్ని, మన ఆర్థిక స్థోమతని కూడా తెలియజేస్తుంది. ఒక ప్రాంతం నుంచి వెలువడ్డ మంచి రచన మనకు అనేక విషయాలు తెలియజేస్తుంది, పువ్వు వెంట వచ్చే తావి లాగా. ఇక సాహిత్యం జీవిత దర్శనం అయినప్పుడు, జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు, అన్ని పార్శ్వాలు అందులో చోటు చేసుకుంటాయి. ప్రధానంగా భాష! అసలు భాషే మూల వాహిక కనుక, భాష ఎంత స్పష్టంగా ఎంత సరళంగా వాడితే, ఆ రచన అంత స్పష్టంగా అంత సరళంగా అంత బలంగా తయారవుతుంది.
సాహిత్య పరిణామ క్రమంలో ఒకప్పుడు పండితులు మాత్రమే రచనలు చేసేవారు. రచనలు గ్రాంధికంలో వచ్చేవి. భూస్వామ్య వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినట్లుగా సాహిత్యం గ్రాంధికంలోంచి వ్యావహారికంలోకి మారింది. వ్యావహారిక భాషను పత్రికా భాష, ఉమ్మడి భాష అని ఏ పేరుతో నైనా పిలుచుకోవచ్చు. కానీ, ప్రామాణిక భాష ఏదీ అంటే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంత భాషే ప్రామాణికం. సజనాత్మక రచనలు ఆయా ప్రాంతీయ భాషల్లో వచ్చినపుడే బలంగా ఉంటున్నాయన్న విషయం నిర్వివాదాంశం.
పరిపాలనా వ్యవస్థకు, శాస్త్ర సాంకేతిక విషయ వివరణకు ఉమ్మడి భాషను ఉపయోగించుకోవచ్చు . ఎందుకంటే ఆ భాష, అందులోని విషయం అన్ని ప్రాంతాల వారికి అందాల్సి ఉంది గనుక. సజనాత్మక రచనలు కూడా ఉమ్మడి భాషలో చేపట్టొచ్చు. విషయాన్ని ప్రతిభావంతంగా దర్శింపజేయొచ్చు. కవిగాని, రచయిత గాని తీసుకునే ఇతివత్తాన్ని బట్టి. రచన ఏ భాషలో ఉండాలనేది, నిజానికి ఆ రచనే నిర్దేశించుకుంటుంది. ఒక ప్రాంతానికి చెందిన భాషను, యాసను ఉపయోగించి రచన వెలువడితే అది ఇతర ప్రాంతాల వారికి అర్థం కాదు అనేది తప్పు. కొన్ని సాహిత్య విలువలతో దానిలోని స్ఫూర్తి, ఆర్తి నేరుగా అన్ని ప్రాంతాల పాఠకులకు అందుతుంది. స్వానుభవంతో చెప్పేదేమంటే తెలంగాణ ప్రజల భాషలో నేను తొలుత రాసిన కవితలు, కథలూ తెలుగు రాష్ట్రాల్లోనూ, వాటి బయటా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యాయి. పైగా అవి ప్రజల భాషలో రాసినందుకే శక్తిమంతమయ్యాయని అందరూ ఒప్పుకున్నారు. అర్థం కాలేదని ఎవరూ అనలేదు.
ప్రత్యేకంగా ప్రజల భాషలో రచనలు రావడానికి చాలా సంవత్సరాలకు ముందే ఆ భాషా పదాలు సాహిత్యంలో జొరబడ్డాయి. మన ప్రాచీన సాహిత్య ప్రక్రియలైన పద కవిత, తత్వ కవిత, మార్గ కవిత, శతకం, ద్విపద లాంటి వాటిలో ప్రజల భాషలోని పదాలు చాలా కనబడతాయి. రచనలు ప్రజలకు అర్థం కావాలి. అందుబాటులోకి రావాలి అనే భావనలోంచే కవులు తమ రచనలో ప్రజా భాషా భాషాపదాల్ని ఎక్కువగా వాడి ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రాచీన కాలం నుండి నేటి అత్యాధునిక యుగం వరకు ఉన్న కవులు, రచయితలలో కొంతమంది తమ రచనలు జానపద సాహిత్యానికి దగ్గరగా లేదా సమాంతరంగా ఉండాలనుకోవడం వల్ల ప్రజల భాషలోని పదాలు లిఖిత సాహిత్యంలో అంతర్భాగమయ్యాయి. అవుతున్నాయి. ఇక ముందు కూడా అవుతాయి.
ఉమ్మడి భాషలో ప్రాంతీయ పదాలు జొప్పించి ఒకరకమైన స్వతంత్ర ప్రత్యేక ప్రాంతీయ భాషకు రూపకల్పన జరుగుతూ ఉంది. ఉదాహరణకు ''బతుకులోని తండ్లాటను తెలుసుకో'' అనే వాక్యంలో ''తండ్లాట'' అనేది తెలంగాణ పల్లెల్లో విరివిగా వినిపించే మాట! మిగతా పదాలు అన్ని తెలుగు ప్రాంతాల్లో వినిపించే మాటలు. నేత పనివారి జీవితాల గూర్చి వచ్చే రచనల్లో - వారి వత్తికి సంబంధించిన పదాలు చేరతాయి. బొగ్గు గనుల్లో పనిచేసే వారి జీవితాల గూర్చి వచ్చే రచనల్లో వారికి పరిమితమైన సాంకేతిక పదజాలం సాహిత్యంలో చేరుతుంది. గొండు జీవితాల గూర్చి వచ్చిన సాహిత్యంలో గోండు భాషాపదాలు చేరుతున్నాయి. ఉదాహరణకు ''పేన్కు అన్నాడు కుర్సింగ రాం''. ఇందులో పేన్కు అంటే దేవుడు. పేన్కు దయి' అంటే దేవుని దయ అని అర్థం. అలాగే కుర్సింగ్ రాం గోండు జాతి వారు పెట్టుకునే పేరు.
'ఆయినా ఉత్రాయించు సార్! గాలి గుసాయించి సతాయిస్తోంది'' అని ఒక కథలో ఒక పాత్ర అంటుంది. తెలుగైపోయిన ఉరుదూ పదాలతో ఒక రకమైన భాష హైదరాబాదు పాత బస్తీలో వినిపిస్తుంది. ''అద్దం వేసేయండి. గాలి జొరబడి బాధిస్తోంది '' అని ఆ మాటకు అర్థం. ఈ విధంగా తెలంగాణ ప్రజల భాష ఉరుదూ, ఫారసీ, అరబ్చీ, సంస్కతం, కన్నడం, మరాఠీ లాంటి అనేక భాషల పదాలతో తయారయ్యింది. ఆధునిక కాలంలో విద్యావంతుల సంఖ్య పెరుగుతున్న కొద్ది ఇంగ్లీషు పదాలు ఎక్కువగా చేరుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి భాష పెరుగుతూ ఉండడంతో పాటే ప్రాంతీయ భాష కూడా పెరుగుతూ ఉంది. గమనించ వల్సిన విషయమేమంటే, ఒక ప్రాంతీయ భాషలోనే అనేకనేక భాషా భేదాలున్నాయి. ఉంటాయి. ఎక్కడికక్కడ అవి ఉమ్మడి భాషలో కలిసి పోతుంటాయి. సమకాలీన సాహిత్వ రంగంలో ఎంతోమంది ప్రతిభామూర్తులు నిజాయితీగా తమ తమ మూలాల్ని వెతికి చూపుతున్నారు. వారంతా తమ గళంలో ఒరిగిన భాషను యాసను తమ కాలంలో జొప్పించి గర్వించదగ్గ సాహిత్యాన్ని సష్టిస్తున్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందించవల్సిందే !
సాహిత్యం స్పష్టంగా ఉండాలి. నిజాయితీలోంచి రావాలి. చిత్తశుద్ధిలోంచి రావాలి. నిజాల్ని వెల్లడించాలి. మరి ఇవన్నీ ఉండాలన్నప్పుడు సమాజంలోని మనుషుల్లాగానే ఆయా ప్రాంతపు సాహిత్య పాత్రలు కూడా ఆయా సమాజాల్లోంచే రావాలి. అలాంటప్పుడు పలుకుబళ్ళు, జాతీయాలు, నుడికారాలు తప్పనిసరి. అవన్నీ ఉన్నాప్పుడే సాహిత్యం సమాజపు ఆత్మలో అంతర్భామైపోతుంది. పచ్చి నిజాలు ఉన్నవి ఉన్నట్లు రాస్తే అది సాహిత్యం కాదు. వాస్తవాల మీద కాల్పనికా సజనాత్మకత ఒక సన్నని పొదలా కప్పి ఉండాలి. అప్పుడే ఆ నిజాలు సాహిత విలువలుగా మారిపోతాయి. సరే, ఈ విషయాలు ఇట్లా ఉండనిద్దాం..
భాషాసాహిత్యాల గురించి మనం ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు. భాషోద్యమాల గురించి ఎంతైనా చర్చించుకోవచ్చు. ప్రతి ఒక్కరు తల్లి పాలు తాగి పెరిగితేనే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మాతభాషలోనే విషయాలు సుళువుగా నేర్చుకోగలుగుతారు. ప్రపంచ దేశాలెన్ని తిరిగినా, ఎంతో మందిని కలిసినా, తల్లి స్థానం తల్లికే ఉంటుంది. తల్లి లాంటి పుట్టి పెరిగిన ఊరి స్థానం ఆ ఊరికే ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం వైజ్ఞానికంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యుగస్పహను జీవితానికి అన్వయించుకోవాలి. మనం పిల్లలకు ఏం నేర్పుతున్నాకున్నది కూడా ఇప్పుడు చాలా ముఖ్యం! పసిపిల్లలు నిలకడగా కూర్చుంటున్న దశలాగే మనవాళ్ళు 'జేజకు దండం పెట్టూ' అని చెపుతుంటారు. ఇంకొంచెం పెరగగానే 'జాబిల్లి రావే' అని పాడి వినిపిస్తుంటారు. మాటలు వస్తున్న దశలోనే 'చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ' అని దేవుడి వర్ణనలతో పాఠాలు ప్రారంభమవుతాయి. వాస్తవం ఏమంటే వేల యేళ్లు గడిచినా చందమామ దిగి రాలేదు. మనిషే చంద్రుడి పైకి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఊహల్లోంచి, భ్రమల్లోంచి వచ్చేది సాహిత్యమైతే, వాస్తవంలోంచి నిజంలోంచి వచ్చేది సైన్సు. 'పద పద పోదాం .. చంద్రుడి పైకి' అని పాడాల్సిన సమయం వచ్చింది కదా? దేవుడు, దయ్యం, భూతాలు, మహిమలు, మాయల కథలు మానేసి మానవుడి శౌర్య గాథలు చెప్పాల్సిన సమయం ఇది. ''జానీ జానీ- యస్ పాప్పా'', ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్'' లాంటి ఇంగ్లీష్ రైమ్స్ పర్యావరణం గూర్చి, సామాజిక జీవనం గూర్చి, వ్యక్తిత్వవికాసం గూర్చి ఉన్నాయి. దేవుడి గూర్చి, భక్తి గూర్చి, మతం గూర్చి లేవు. ఏ దేశంలో ఏ భాషలో ఎలాంటి అబద్దపు పాటలు ఉన్నా అని పిల్లలకు నేర్పడం మానెయ్యాలి. వారికి వాస్తవాలు చెప్పడం అవసరం. సంస్కతి, సంప్రదాయం పేరుతో గతంలోని చెత్తనంతా వచ్చే తరాల మీద రుద్దకూడదు. వారి రెక్కల మీద మోయలేని భారం వేసి, సంశయంలో పడదోసి వారి జీవితాలు దుర్భరం చేయకూడదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడనివ్వాలి. మానవీయ విటవల్ని దర్శింపనీయాలి. భాష మన ఐడి కార్డు నిజమే! బాల్యంలో బోధన మాత భాషలోనే జరగాలి. నిజమే! అదే న్యాయం. అయితే అది వాస్తవ దక్కోణంలోంచి వైజ్ఞానికంగా జరగాల్సి ఉంది.
- డాక్టర్ దేవరాజు మహారాజు










