Oct 10,2023 15:06

ప్రజాశక్తి-రాజోలు: నిబంధనలకు విరుద్ధంగా,ఎటువంటి అనుమతులు రాకపోయినప్పటికీ, రైతులకు నోటీసులు ఇవ్వకుండా దళితుల సొసైటీ భూములను బలవంతంగా భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధమని తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కేశనపల్లి పడమటి పాలెం సిసిఎఫ్‌ సొసైటీ భూములను బాధిత కుటుంబాలతో కలిసి పరిశీలించి, వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ సొసైటీ భూములను గత 100 సంవత్సరాల నుండి కొబ్బరి చెట్లు సరుగుడు తోటలు వేసుకుని జీవనోపాధి పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ భూములను ఏవిఆర్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీకి అప్పగించడానికి జిల్లా అధికారులు బలవంతం చేస్తున్నారని కన్నీటి పర్యంతమై ఆయన వద్దవాపోయారు. సొసైటీ భూములలో ప్రతి వాటా సభ్యుని పూర్వికుల సమాధులను ఇక్కడే చేసి ఉన్నారు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భయాందోళనలో ఉన్నారు. ఏవిఆర్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీకి అప్పగించే సర్వేను తక్షణమే నిలుపుదల చేయకపోతే బాధితులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితుల సొసైటీ భూములను సేకరించడానికి ప్రయత్నిస్తే రైతులతో కలిసి ఆందోళనకు పూనుకుంటామని, స్థానిక ఎమ్మార్వో వివీఎల్‌ నరసింహారావు తో అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు చవ్వాకుల వెంకట్‌ ,బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకులు బడుగు సాయిబాబా, ఆకుమర్తి భూషణం,జనసేనపార్టీ నాయకులు విపర్తి సాయిబాబా, యనుముల సాయిబాబా, రాజోలు నియోజకవర్గంపరిరక్షణ చైతన్య సమితి నాయకులుమంద సత్యనారాయణ, పోతుల అమర్నాథ్‌, పెదపాటి శ్యాంబాబు,జనిపల్లి నాని, మోకా శ్రీనుబాబు, రైతులు యడ్ల సుమలత,కొల్లా బత్తుల ఆనంద్‌ కుమార్‌, యడ్ల చిట్టిబాబు, యడ్ల మణిరావు, యడ్ల అన్నవరం, ఓగూరి సాయిబాబు గడ్డం రామ్మూర్తి తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.