తెల్ల కాగితం ఆకాశంపై
అక్షరాల పక్షుల్ని ఎగరేసిన ప్రతివాడు కాలేడు కవి
ఆకలి మంటల కాక రవంతైనా అనుభవించి ఉండాలి
ఉప్పని కన్నీటి రుచి కొంచెమైనా చవిచూచి ఉండాలి
అవమానాల కొరడా దెబ్బలకు మనసు చర్మం కాస్తైనా రేగి ఉండాలి
అప్పుడు కదా! అంబ పలికినట్లు కవిత్వం పలుకుతుంది
ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క నిప్పులు జ్వాలై దహిస్తుంది
ఒక్కొక్క ఉప్పెనై కల్లోలం సృష్టిస్తుంది
నిద్రపోతున్న జాతిని కుదుపు కుదిపి
ఉలిక్కిపడేలా మేల్కొలుపుతుంది!
అదే అతని కవిత్వం
రెండక్షరాల పెనుమంట అతడు
రెండక్షరాల మహాకవి అతడు
శ్రీ శ్రీ శ్రీ
ఎవరి మనసులోనైనా ఏముంటుంది
అవయవ సమాహారాలు
అందాల చిత్తరువులు
ప్రాణంలేని మనసు ఉనికిలేని మరబొమ్మలు
యవన సురభిళ శిల్పాలు
అప్పుడు కదా! మహాకవీ!
వీధిలో అడుక్కునే ముసలమ్మలో
కడుపు లుంగలు చుట్టుకుపోయే ఆకలినీ
పంటి బిగువున రాక్షసరతి బాధననుభవించే
పడుపుకత్తె వ్యధలను ఒడిసిపట్టింది
ఆ కలం
శ్రీ శ్రీ శ్రీ
నిజంగా అనితర సాధ్యం నీ మార్గం
సంతకం అక్కర్లేని కవిత్వం
నీ సిద్ధాంతాలతో విభేదించే వారు సైతం
నీ కవితను విని తలయూచి పరవశించారు
శ్రీ శ్రీ శ్రీ
సినిమా పాటలు రాసినా
సిరిసిరిమువ్వ శతకం రచించినా
నీ ముద్ర నీ ముద్రే
అశ్వాహృదయం తెలిసి
కనురెప్పపాటులో యోజనాల దూరం
మటుమాయం చేసే ఆశ్వికుడు నకులుడు
అక్షరాల పగ్గాలను చేతబట్టి
శబ్దాశ్వాలను ధాటిగా దీటుగా
నడిపించిన నేటి కవితా మాంత్రికుడవు
తెలుగు కవిత్వ జెండాను
విశ్వవీధుల్లో ఎగరేసిన ఘనాపాఠివి మేటివి
కవీ! నీ కవితా జలపాతం హౌరులో
తడిసిపోతిని మురిసిపోతిని
దివ్య లోకాల తేలిపోతిని
కవీ! నీకు ఇదే నా లాల్ సలామ్!
లాల్ సలామ్!
- మందరపు హైమవతి
9441062732










