Jan 02,2023 11:42
  • అందని కనీస కూలి
  • పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు నిల్‌
  • పట్టించుకోని కార్మిక శాఖ

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : పోర్టు కార్మికులకు ఆర్థిక, భౌతిక భద్రత కరువైంది. కార్మిక చట్టాల అమలు మచ్చుకు కూడా కానరావట్లేదు. కనీసం కూలి రేట్లనూ అమలు చేసే పరిస్థితి లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి బాధ్యత వహించి కార్మికులను ఆదుకునేవారే కరువయ్యారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో కార్మికులు బానిసల్లా పనిచేయాల్సి వస్తోంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో ఎగుమతి, దిగుమతి కూలీలతోపాటు సర్వేయర్‌ అండ్‌ టాలీ, బాలబంధు (బస్తాలు కుట్టేవారు), స్వీపర్లు, బార్జీలకు పెయింటింగ్‌, ఫిట్టింగ్‌ పనులు చేసే ఫ్యాబ్రికేటర్లు ఇలా మొత్తంగా దాదాపు నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు ఎనిమిది నుంచి 12 గంటల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పగలనకా, రాత్రనకా కష్టపడ పనిచేస్తోన్నా వీరికి కనీస వేతనాలు అందడం లేదు. సర్వే అండ్‌ టాలీ వర్కర్లు మధ్యవర్తి ద్వారా పనులకు వెళుతున్నారు. వీరికి రూ.300 మాత్రమే కూలి వస్తోంది. ప్రతి కార్మికుల వద్ద మధ్యవర్తి రూ.50 కమిషన్‌గా తీసుకోగా, వారి చేతికి రూ.250 మాత్రమే అందుతోంది. కార్మికుల శ్రమను పోర్టులోని కాంట్రాక్ట్‌ సంస్థలు దోచుకుంటున్నాయి. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించకుండా తప్పించుకొనేందుకు యాజమాన్యం మధ్యవర్తుల ద్వారా కార్మికులను పనుల్లో పెట్టుకుంటోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సాయం అందించే పరిస్థితి కూడా లేదు. కార్మికులకు ప్రభుత్వం నుంచి సౌకర్యాలు అందేలా, భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన కార్మిక, పరిశ్రమ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదంటూ పోర్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
           గతేడాది ఆగస్టు 20న కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్‌ సమీపంలో సముద్రంలో సరుకు రవాణా చేసే నౌక (బార్జి) ఫ్యాబ్రికేషన్‌ మరమ్మతు పనుల నిమిత్తం వెలుపలికి దిగి వెల్లింగ్‌ చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో కాకినాడ ఏటిమోగకు చెందిన బలసాటి దుర్గాప్రసాద్‌ (26), జగన్నాథపురం గ్రామానికి చెందిన సూరిమళ్ల రాకేష్‌ (17), పోలవరపు శ్రీనివాస్‌ (32) సజీవ దహనమయ్యారు. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు తెలిపారు. వీరికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు.
              ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. సిఐటియు నాయకులు పట్టుబట్టి చర్చలు చేయడంతో కుటుంబసభ్యులకు కొంత ఆర్థిక సాయం అందింది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు యాజమాన్యం కార్మికుల భద్రతను గాలికొదిలి వ్యవహరిస్తోందనడానికి ఈ సంఘటన తాజా నిదర్శనంగా నిలుస్తోంది.

22

                                                                            కనీస కూలి అందట్లేదు

పోర్టులో క్వాలిటీ, క్వాంటిటీ విభాగంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి తప్ప కూలి మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం రోజుకు రూ.250 మాత్రమే వస్తోంది. పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే పట్టించుకొనే వారు కరువయ్యారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు లేక ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్‌ కోల్పోతున్నాం.
                                                                                          - పెండెం సూర్యారావు, సర్వేయర్స్‌ అండ్‌

worker


                                                                            టాలీ కార్మికుడు

ప్రమాదపు అంచుల్లో పనిచేస్తున్నాం పొట్ట కూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదమని తెలిసినా బార్జీలకు వెల్డింగ్‌, పెయింటింగ్‌, ఫిట్టింగ్‌ పనులు చేస్తున్నాం. తరచూ ఏదొక ప్రమాదం జరుగుతోంది. మేమే సొంతంగా ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. రోజుకి రూ.500 మించి కూలి రావడం లేదు. కాంట్రాక్టు సంస్థ పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించడం లేదు.
                                                                                                                         - బివి.రమణ, ఫ్యాబ్రికేషన్‌ వర్కర్‌