Oct 23,2023 11:46
  • పెరిగిన పెట్టుబడులు, తగ్గనున్న దిగుబడి

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు సాగుకు వర్షాభావం తీవ్ర ప్రతిబంధకంగా మారింది. రాష్ట్రంలో 1.60 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 50 శాతం విస్తీర్ణంలోనే సాగులో ఉంది. వర్షాభావం వల్ల గుంటూరు, ప్రకాశం నెల్లూరు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పొగాకు సాగు జాప్యం జరుగుతోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో బోర్ల ద్వారా నీటి వనరులు అందుబాటులో ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లతో నీరు తెచ్చి భూమిని తడిపి పొగాకు నాటుతున్నారు. ఆ తర్వాత మొక్కలు నిలదొక్కుకోవడానికి ఎరువులు, నీటిని వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఎకరాకు అదనంగా రూ.6 నుంచి రూ.10 వేల వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని రైతులు చెప్తున్నారు. కొన్ని మండలాల్లో ఎండల తీవ్రత వల్ల మొక్కలు నిలదొక్కుకోవడం లేదు. దీంతో, నాట్లు వేసిన కొద్ది రోజులకే ఎండిపోయిన పైరును తొలగిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతంలో ఇటీవల వంద ఎకరాల్లో పైరు ఎండిపోవడంతో రైతులు తొలగించారని అధికారవర్గాలు తెలిపాయి. వర్షాభావం వల్ల అధిక ఖర్చుతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సానుకూలమైన వాతావరణం ఉంటే ఎకరాకు కనీసం 9 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడి రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా డిసిపల్లి, కలిగిరి, ప్రకాశం జిల్లా పొదిలి, కందుకూరు, కొండేపల్లి, మార్టూరు తదితర ప్రాంతాల్లో పొగాకు సాగు జరుగుతోంది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్‌ వల్ల రైతులకు కొంత వరకు మేలు జరిగింది. ఈ ఏడాది వర్షాభావం వల్ల అధిక ఖర్చు, దిగుబడి నష్టం రెండు భారంగా మారనున్నాయని రైతు నాయకులు చుండూరు రంగారావు తెలిపారు. ఒక్కో బ్యారెన్‌ పరిధిలో ఆరేడు ఎకరాల వరకు సాగవుతుందని, దాదాపు రూ.70 వేల వరకు అదనపు పెట్టుబడి అవుతోందని తెలిపారు. దిగుబడి తగ్గడం వల్ల మరో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు నష్టం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో కూడా వర్షాభావం వల్ల పొగాకు నాట్లు ఎండిపోతోంది. దీంతో, రైతులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెచ్చుకొని నాట్లు వేస్తున్నారు.