
భారత్‌లో పొగాకు వినియోగం ఆందోళనకరంగా మారింది. ఇది ఇప్పటికే లక్షలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నది. వారిని అనారోగ్యాలకు గురి చేస్తున్నది. దేశంలో నిషేధం ఉన్నప్పటికీ.. రూపాలు మార్చుకొని మరీ విక్రయాలు జరుగుతున్నాయి. గుట్కా, పొగాకు ఉత్పత్తి కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ధూమపాన పొగాకు ఉత్పత్తుల కంటే పొగ రహిత పొగాకు వినియోగం భారత్‌లో అధికంగా ఉన్నది. భారత్‌లోని ప్రతి ఆరు కుటుంబాల్లో ఒక కుటుంబం పొగాకు నములుతున్నవారి జాబితాలో ఉన్నది. లోకల్‌సర్కిల్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రతి ఆరింటిలో ఒక కుటుంబానిది ఇదే స్థితి
- పొగ రహిత పొగాకును వినియోగించే జనాభా 21.4 శాతం
- ఇది ధూమపాన పొగాకు ఉత్పత్తుల వాడకం కంటే అధికం
- లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : పొగాకు ఉత్పత్తులు దేశంలోని ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పొగాకు వినియోగంపై ఎన్ని అవగాహనా కార్యక్రమాలు, ప్రచారాలు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం కనబడటం లేదు. ముఖ్యంగా, ధూమపాన పొగాకు కంటే నమిలే పొగాకు వినియోగం భారత్‌లో అధికంగా ఉన్నది. దేశంలోని ప్రతి ఆరు కుటుంబాల్లో ఒక కుటుంబం నమిలే పొగాకును వినియోగిస్తున్నది.
లోకల్‌సర్కిల్స్ సర్వే సమాచారం ప్రకారం.. భారత్‌లో 2012 నుంచి గుట్కాతో సహా అన్ని రకాల పొగలేని పొగాకు నిషేధించబడింది. గుట్కాలను ఉత్పత్తి చేసే కంపెనీలు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ నిషేధాన్ని అధిగమించటానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో గుట్కాపై నిషేధం, పొగాకు నియంత్రణ అవసరమని ది లాన్సెట్ నివేదిక హెచ్చరించింది.
క్యాన్సర్‌లో 55 శాతం టొబాకో వినియోగంతోనే
వారణాసిలో జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం.. భారత్‌లో ప్రమాదకర క్యాన్సర్ వ్యాధిలో 55 శాతం టొబాకో వినియోగానికి సంబంధించినవే. ప్రపంచంలోనే భారత్ పొగాకు ఉత్పత్తి, ఎగుమతిలో మూడో స్థానంలో ఉన్నది. భారత్‌లో పొగ రహిత పొగాకును ఉపయోగిస్తున్న జనాభా (పెద్దలు) 21.4 శాతంగా ఉన్నది. ఈ సంఖ్య.. ధూమపాన పొగాకును వినియోగిస్తున్న జనాభా (పెద్దలు) 10.7 శాతం కంటే అధికంగా ఉండటం గమనార్హం.
కఠిన చర్యలను కోరుతున్నవారు 81 శాతం మంది
ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 83 శాతం మంది గుట్కా లేదా ఇతర నమలగల పొగాకు ఉత్పత్తులను వినియోగించటం లేదని తెలిపారు. పది శాతం మంది మాత్రం కుటుంబంలోని ఒక వ్యక్తి దానిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. మొత్తమ్మీద ఈ సర్వేలో పాల్గొన్న కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రతి ఆరు భారతీయ కుటుంబాలలో ఒక కుటుంబం (ఇందులో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది).. గుట్కా లేదా ఇతర నమలగల పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న జాబితాలో ఉన్నది. నమిలే పొగాకు ఉత్పత్తులు, అమ్మకాలపై నిషేధం తప్పనిసరిగా విధించాలని 81 శాతం మంది కోరారు. 19 శాతం మంది వద్దన్నారు. అంటే ప్రతి పది మంది భారతీయులలో 8 మంది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
భారత్‌లో జోరుగా పాన్ మసాలా వ్యాపారం
ఇటు భారత్‌లో పాన్ మసాలా వ్యాపారం జోరందుకున్నది. ఎంట్రప్రెన్యూర్ ఇండియా సమాచారం ప్రకారం.. భారత్‌లో ఈ వ్యాపారం 2020లో రూ.42,200 కోట్లకు చేరుకున్నది. 2021-26 మధ్య ఈ వ్యాపారంలో వృద్ధి పది శాతం ఉంటుందనీ, రూ.74,760 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. లోకల్‌సర్కిల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సర్వేను భారత్‌లోని 318 జిల్లాల్లో గల 34 వేల మందిని సంప్రదించి సమాచారాన్ని సేకరించారు. 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.