Aug 03,2023 08:19
  • కేంద్ర కార్యదర్శిని అభ్యర్థించిన వైసిపి ఎంపిలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని 2023-24 పంట సీజనులో 170 మిలియన్‌ కిలోలకు పెంచాలని కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్‌ అగర్వాల్‌ను వైసిపి ఎంపిలు అభ్యర్థించారు. ఈ ఏడాదిలోనూ వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణం గతేడాది మాదిరిగానే 142 మిలియన్‌ కిలోలుగా ఉండాలని, ఇటీవల సమావేశంలో పొగాకు బోర్డు తీర్మానించిందని తెలిపారు. ఈ పరిమాణాన్ని 170 మిలియన్‌ కిలోలకు పెంచాలని వైసిపి ఎంపిలు కోరారు. వైసిపి ఎంపిలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌ కలసి వినతిని కేంద్ర సెక్రటరీకి అందజేశారు.ఈ విషయంలో కేంద్ర కార్యదర్శి రాకేశ్‌ అగర్వాల్‌ సానుకూలంగా స్పందించినట్లు వైసిపి ఎంపిలు తెలియజేశారు.