
ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత గల్లా జయదేవ్ ప్రసంగిస్తూ, తమ నేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిందని అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేశారన్నారు. స్కిల్ కేసులో రూ.371 కోట్లు విడుదల చేశారన్నది ప్రధాన ఆరోపణని.. చంద్రబాబుకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలూ చూపలేదన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్టు చేశారన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలని.. ఆయన్ను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గల్లా జయదేవ్ ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో కుంభకోణం జరిగిందని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని, టీడీపీ అధినేత అరెస్టులో ఎలాంటి కక్ష సాధింపు లేదని వెల్లడించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నకిలీ జీవోల సాయంతో రూ.371 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో నగదు ఎక్కడికి వెళ్లిందో ఈడీ స్పష్టం చేసిందని, ఇంకేం ఆధారాలు కావాలని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని అన్నారు.