
అధికారుల ప్రేక్షక పాత్ర ఆగ్రహం
లో గ్రేడ్ పొగాకును రూ.200కు కొనాలని డిమాండ్
ప్రజాశక్తి- టంగుటూరు:పొగాకు వ్యాపారులు సిండికేట్ కావడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాన్ని అడ్డుకున్నారు. అధికారులు ప్రేక్షక పాత్రపై కన్నెర్ర చేశారు. లోగ్రేడ్ పొగాకును రూ.200కు కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రకారం జిల్లా టంగుటూరులో పొగాకు వేలం కేంద్రం వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. టంగుటూరులోని కొండపి రోడ్డులోగల పొగాకు బోర్డుకు మండలంలోని పొందూరు గ్రామ రైతులు 880 బేళ్లను తెచ్చారు. లోగ్రేడ్ పొగాకు ధరను వ్యాపారులు తగ్గిస్తూ వేలం పాడారు. వారం క్రితం కిలోకు రూ.167 ధర లభించింది. దీన్ని క్రమంగా తగ్గించేస్తూ వచ్చారు. సోమవారం రూ.163కు కొన్నారు. మంగళవారం రూ.160 ధర మించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతసేపు వేచిచూసినా వ్యాపారులు ధర పెంచకపోవడంపై వేలాన్ని అడ్డుకున్నారు. దీంతో, దాదాపు రెండు గంటలపాటు వేలం నిలిచిపోవడంతో పొగాకు బోర్డు అధికారులు రైతులతో చర్చించారు. అనంతరం వ్యాపారులను పిలిచి మాట్లాడారు. కొంతధర పెంచి కొనుగోలు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. రూ.163కు కొనుగోలు చేశారు. నెంబర్ గ్రేడ్ పొగాకు రూ.250కు, లోగ్రేడ్ పొగాకు రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అమ్మేదిలేదంటూ వేలాన్ని మళ్లీ అడ్డుకున్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం కావడంతో వేలం ఆగిపోయింది. తమ పక్షాన నిలబడాల్సిన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి పునరావృతం అయితే, పొగాకు వేలాన్ని జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు పొందూరు గ్రామ రైతులు బోర్డు ప్రాంతీయ అధికారి ఎం లక్ష్మణరావుకు, వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. వీరిలో ఫ్లోర్ కమిటీ రైతు నాయకులు పోతుల నరసింహారావు, రైతు నాయకులు వేజెండ్ల సింగయ్య, పొందూరు గ్రామ పొగాకు రైతులు ఉన్నారు.