
గంగులు బాల్యం నుండి దొంగతనాలు చేసి బతికేవాడు. యుక్తవయస్సు వచ్చిన తన కుమారుడ్ని కూడా తనలా దొంగతనాలు చేయమని ఒత్తిడి చేసేవాడు. కుమారుడు మాణిక్యంకు అలా బతకడం ఇష్టం లేదు. కష్టపడి గౌరవంగా బతకాలనుకునేవాడు. ఒకరోజు గంగులు ఊళ్లో ఉన్న మాస్టారు ఇంట్లో ఉన్న గేదెను దొంగతనం చేసి ఇంటికి తీసుకు వచ్చాడు.
'ఈ పని తప్పు నాన్నా.. అది ఎవరిదో వారికి ఇచ్చేసేరు' అని మాణిక్యం నచ్చచెప్పాడు. అయినా గంగులు వినలేదు. గేదె పోయిందని మాస్టారు ఊరంతా వెతికి వెతికి, చాలా దిగాలుగా స్కూలుకు వచ్చారు. రోజూ చాలా ఉత్సాహంగా పాఠాలు చెప్పే మాస్టారు దిగులుగా ఉండడం గమనించిన మాణిక్యం ఆరా అడిగాడు. 'తన గేదే పోయిందని, అది చాలా పాలు ఇస్తుందని, ఇప్పుడది లేకపోవడంతో పిల్లలు పాలకు చాలా ఇబ్బంది పడతార'ని చెబుతూ మాస్టారు చాలా బాధపడ్డారు. అప్పుడు తన తండ్రి తీసుకువచ్చిన గేదె మాస్టారుదే అని మాణిక్యానికి అర్థమై నిజం చెప్పాడు. వెంటనే మాస్టారు గంగులును పిలిపించి గేదెను ఇమ్మని అడిగాడు.
గంగులు ఒప్పుకోకపోవడంతో పంచాయతీలో పెట్టాడు. అక్కడ కూడా గంగులు గేదె తనదేనని, మాస్టారు అబద్ధం చెబుతున్నారని చెప్పాడు.
అయితే మాణిక్యం వచ్చి సాక్ష్యం చెప్పడంతో గంగులు దొంగతనం బయటపడింది. 'నీ కొడుకును చూసి బుద్ధి తెచ్చుకో.. నీకంటే చిన్నవాడైనా దొంగతనం మంచిది కాదని నిజం చెప్పాడు. కష్టపడి సంపాదించడం నేర్చుకో' అని ఊరిపెద్దలు గంగులుకు హితవు చెప్పారు. గంగులు చేత దొంగతనాలు మాన్పించాలని ఊరంతా చందాలు వేసుకుని అతనితో ఓ చిల్లర దుకాణం పెట్టించారు. అప్పటి నుండి గంగులు శ్రమ విలువ తెలుసుకుని దొంగతనాలు మానేశాడు.
- షేక్ అబ్దుల్ హకీం జాని,
99494 29827