Apr 12,2023 21:30

హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ తర్వాత పెరిగిన వాటాలు
న్యూఢిల్లీ : అదాని గ్రూపునపె తీవ్ర విమర్శలు వస్తున్న వేళ మరోవైపు ఆ సంస్థలో లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) పెట్టుబడుల పరంపర మాత్రం కొనసాగుతుంది. అదానిపై హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌నకు తోడు ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలోనూ ఎల్‌ఐసి వాటాలు పెరగడం గమనార్హం. అదాని కంపెనీలపై ఆర్థిక అవకతవకాలు, మోసాలపై ఆరోపణాలు వెళ్లువెత్తడంతో ఇటీవల ఆ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చవి చూశాయి. దీంతో ఎల్‌ఐసి తీవ్ర నష్టాలను ఎదురు చూసింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికం (క్యూ4)లో అనేక మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, విత్త సంస్థలు అదాని గ్రూపులో వాటాలను తగ్గించుకోగా.. ఎల్‌ఐసి వాటాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నాలుగు అదాని కంపెనీల్లో ఎల్‌ఐసి వాటాలు పెరగ్గా మరో రెండింటిలో తగ్గాయి. గడిచిన క్యూ4లో అదాని ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసి వాటా 4.23 శాతం నుంచి 4.26 శాతానికి పెరిగింది. అదాని గ్రీన్‌ ఎనర్జీలో 8 బేసిస్‌ పాయింట్లు పెరిగి 1.36 శాతానికి చేరాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 5.96 శాతం వాటా 6.02శాతానికి ఎల్‌ఐసి వాటా పెంచుకుంది. అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్స్‌లో 6.33 శాతంగా ఉన్న వాటాను 6.30 శాతానికి కోత పెట్టుకుంది. అదాని సెజ్‌లో వాటాలను 9.14 శాతం నుంచి 9.12 శాతానికి తగ్గించుకుంది. అదాని గ్రూపు కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు తమ వాటాను 1.19 శాతం నుంచి 0.87 శాతానికి తగ్గించుకున్నాయి. అదాని కంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన ఎంఎఫ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 31 నుంచి 27కు తగ్గింది.