Dec 08,2022 21:02
  • సిఇఒగా అవకాశం..!
  • త్వరలో ఛైర్మన్‌ హోదా రద్దు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) నిర్వహణ బాధ్యతలను ప్రయివేటు వ్యక్తి చేతికి అప్పగించడానికి బిజెపి సర్కార్‌ కసరత్తును ప్రారంభించింది. 66 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ దిగ్గజ బీమా సంస్థకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా ప్రయివేటు వ్యక్తిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఇద్దరు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ గురువారం ఓ రిపోర్టులో తెలిపింది. ''ఎల్‌ఐసి నిర్వహణ బాధ్యతలను ప్రయివేటు వ్యక్తి చేతికి అప్పగించే పనిలో ప్రభుత్వం ఉంది. అందుకోసం అర్హులైన వాళ్ల నుంచి దరఖాస్తులు అహ్వానిస్తోంది.'' అని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి రాయిటర్స్‌ ఆర్థిక శాఖ వర్గాలను సంప్రదించగా సమాధానం రాలేదు. ప్రస్తుతం ఎల్‌ఐసి ఛైర్మన్‌గా ఎంఆర్‌ కుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ''కుమార్‌ పదవీకాలం పూర్తికాగానే ఈ పోస్టును పూర్తిగా రద్దు చేసి.. ఆ స్థానంలో సిఇఒ పోస్టును సృష్టించాలని.. దానికి ప్రయివేటు వ్యక్తిని ఎంపిక చేయాలని కేంద్రం యోచిస్తోంది.'' అని ఓ అధికారి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గతేడాది వాటాల విక్రయ సమయంలోనే ఎల్‌ఐసి చట్టంలో మార్పులు చేసినట్లు తెలిపారు. ఏ రంగం నుంచి సిఇఒను ఎంపిక చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసిని స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేసి ఆ సంస్థ విలువను దారుణంగా పడిపోయేలా చేసింది. స్టాక్‌ మార్కెట్‌లో వాటాల విక్రయ ప్రక్రియను నిలిపివేయాలని ఆ సమయంలో ప్రతిపక్షాలు, ఎల్‌ఐసి ఉద్యోగ సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు తీవ్ర ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. రూ.949 లిస్టింగ్‌ ధరకు వెళ్లగా ప్రస్తుతం ఈ విలువ రూ.661కి పడిపోయింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో పాటుగా ఎల్‌ఐసి మార్కెట్‌ కాపిటలైజేషన్‌ విలువ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎల్‌ఐసికి రూ.40 లక్షల కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఈ సంస్థకు 28 కోట్ల మంది పైగా పాలసీదారులు ఉన్నారు.