Jun 08,2023 08:10

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ఎల్‌ఐసి ఉద్యోగుల ఉద్యమ నేత కెవి.రమణమూర్తి (64) మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు సోదరుడు రమణమూర్తి. ఆయన మరణ వార్తతో ఎల్‌ఐసి ఉద్యోగులు తీవ్ర విషాదానికి గురయ్యారు. ఎల్‌ఐసిలో ఆయన్ని కెవిఆర్‌ (కొండవలస వెంకటరమణమూర్తి)గా పిలిచేవారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు శ్రీరామ్‌ ఉన్నారు. చావులమధుం శ్మశనవాటికలో బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 1989లో ఎల్‌ఐసిలో ఉద్యోగంలో చేరి 2020లో ఉద్యోగ విరమణ పొందారు. ఎల్‌ఐసి ఉద్యోగుల యూనియన్‌ ఐసిఇయులో పలు బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎల్‌ఐసి పెన్షనర్స్‌ అసోసియేషన్‌లో సహాయ కార్యదర్శిగా సేవలు అందిస్తూ వచ్చారు. సిపిఎం, సిఐటియు ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ అభ్యర్థి విజయానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. వార్వా అక్కయ్యపాలెం జోన్‌ కమిటీలో క్రియాశీలంగా పనిచేశారు.
పలువురు నివాళి
కెవి.రమణమూర్తి భౌతికకాయానికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, వార్వా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.ప్రకాశరావు, బిబి.గణేష్‌, ప్రజా సంఘాల నాయకులు ఆర్‌.గణేష్‌కుమార్‌, బి.లక్ష్మీపతి, ఆర్‌ఎన్‌.మాధవి తదితరులు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.