
- పరిశ్రమల్లో ఇంధనం ఆదా
- ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, ఇంధనాన్ని పొదుపు చేయగలిగే సామర్థ్యం గల కొత్త రకం సిమెంట్ మిక్స్ సాంకేతికతను రాష్ట్రానికి అందించేందుకు స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ కో-ఆపరేషన్ (ఎస్‌డిసి) ముందుకొచ్చిందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. లైం స్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ (ఎల్‌సి-3) అనే నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సాంకేతికత పరిశ్రమలకు లాభదా యకమే కాకుండా భవిష్యత్తులో సిమెంటు పరిశ్రమ రంగంలో కీలకపాత్ర పోషించనుం దని తెలిపారు. ఎస్‌డిసి, ఐఐటి మద్రాస్ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఎపిఎస్‌ఇసిఎం) ప్రతినిధులు పాల్గొన్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌డిసి నూతన సాంకేతికత గురించి ఎస్‌డిసి వివరించినట్లు తెలిపారు. సిమెంటు తయారీలో ఉపయోగించే సున్నపు రాయితో ఎల్‌సి-3ని కలపవడం వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న క్లింకర్ అనే ముడి పదార్థం వినియోగాన్ని పెద్దఎత్తున తగ్గించవచ్చునని తెలిపారు. ఇది స్థానికంగా లభిస్తే సిమెంటు పరిశ్రమలకు అత్యంత లాభదాయకమని పేర్కొన్నారు. 2070 నాటికి కాలుష్య రహితం కావాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ నూతన సిమెంటు మిక్స్ టెక్నాలజీ కొంత మేర దోహద పడుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలశాఖ సహకారంతో ఈ అంశాన్ని సిమెంటు పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇండో స్విస్ బీప్ ద్వారా రాష్ట్ర గృహ నిర్మాణ పథకంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు తగ్గించే సాంకేతికతను ఇటీవల ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పుడు సిమెంటు పరిశ్రమలకు ఎల్‌సి-3 సాంకేతికతను అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. ఇంధన పొదుపు, భద్రత, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పరిశ్రమల రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెర్ఫర్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. పాట్ పథకం 36 పరిశ్రమల్లో అమలవుతుండగా, అందులో 20 సిమెంటు పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. పాట్ పథకం వల్ల రూ.5,709 కోట్ల ఇంధనం ఆదా అయిందని, ఇందులో సిమెంటు పరిశ్రమల్లో రూ.2,400 కోట్లు ఆదా అయిందని వివరించారు. అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.