Jan 13,2023 11:05

మా బొక్కెల్ని ఇరిసి పొయ్యిలోబెట్టి
నాల్గు మెతుకుల్ని కడుపునకేత్తాం
తిరగడాన్కి అడగడాన్కి కాయింత
స్వేచ్ఛగావాలి సారూ
మా బతుకులు గతుకులెంబడి
ఉరుకులు పరుగులెట్టినా పర్లే
మోకాళ్ళపై దేకుతానే ఇడ్చేత్తాం
బయట ప్రశ్నించడాన్కింత
స్వేచ్ఛ కాయింత కావాలి సారూ
గుక్కెడు నీళ్ళకింత గల్లీలు తిరగేత్తాం
బుక్కెడు బువ్వకింత బొక్కెల్నిరుస్తాం
మా గతి మేం పడ్తాలెత్తా
ఏడేడనో వుండి కాలాన్ని దొబ్బేత్తాం
మీకేసి కంట్రెప్పల్ని ఆడించడం ఆపేయం
ఏదో సేత్తారనే ఆశల్ని పోగేత్తా
బోగి మంటల్ని ఏపెత్తున మండించం
మా ఎంగిలి మేం పడతా
తిప్పలన్నీ కుంపటిలా మోసుకుంటాం
కానీ కాలు కదపడాన్కింత
నోరు మెదపడాన్కింత
స్వేచ్ఛగాలి పీల్చడాన్కింత
కూసింత స్వేచ్ఛగావాలి సారూ
మెడ తిప్పితే మొటిక్కాయలేత్తరు
కాదన్నకాడ కాగడాలెలిగిత్తరు
మెదల్డానికింత స్వతంత్రాన్ని
మీకాడనే తీసుకోవాలంటూ
ఆంక్షల్ని అడ్డేసి కదల్నివ్వరు
అయ్యా సారూ ఇట్టా సూడండి
నియంతను కొండంత చేసి
నినాదాల నియంత్రణకై నడుంగట్టి
అడిగే స్వేచ్ఛ రాసే స్వేచ్ఛపై
మన్నుగప్పి ఆనవాళ్లను మాయం చేస్తరు
బతకనీకి మా అగచాట్లు మేం పడతాం
ఇసుమంత చేదోడు వద్దులేగానీ
సమాజంతో మెలగడానికింత
కూసింత స్వేచ్ఛగావాలి సారూ.

- నరెద్దుల రాజారెడ్డి
సెల్‌ : 9666016636