ఒక రోజు జాను అన్నతో కలిసి పక్కనే ఉన్న పార్క్‌కి వెళ్లింది. కొంచెం సేపు ఆడుకొని తర్వాత ఉయ్యాల ఊగడానికి వెళ్లింది. ఉయ్యాల ఊగుతుంటే తన కాలికి ఏదో మెత్తగా తగిలినట్లు అనిపిస్తే కిందకు చూసింది. అక్కడ ఓ చిన్న కుక్కపిల్ల కనిపించింది. అది చాలా అందంగా ఉంది. దాన్ని చూసిన జాను సంతోషంతో ఎగిరి గంతేసింది. కుక్కపిల్లను ఎత్తుకుని పరుగు పరుగున ఇంటికి చేరింది.
'అమ్మా నాకు ఏమి దొరికిందో చూడు..' అని అమ్మకు చూపించింది. దాన్ని చూసిన అమ్మ.. 'జాను నీకు నేను కనిపించకపోతే భయం వేస్తుంది కదా!' అని అడిగింది. అప్పుడు జాను.. 'అవును అమ్మా నాకు చాలా భయం, బాధ కూడా వేస్తుంది' అని అన్నది. ఆ మాటలు విన్న అమ్మ 'మరి నీకు లాగే ఈ కుక్కపిల్లకు కూడా అమ్మ ఉంటుంది కదా! నువ్వు దీన్ని తీసుకువచ్చేస్తే వాళ్ల అమ్మ దీని కోసం బాధపడుతుంది కదా' అని అంటుంది.
అప్పుడు జాను 'అమ్మా నాకు ఈ కుక్క పిల్ల నచ్చింది. నా దగ్గరే పెట్టుకుంటాను' అంటూ ఏడుస్తుంది. ఎంత చెప్పినా వినకపోయేసరికి 'సరే మనం మళ్లీ ఆ పార్కుకు వెళ్దాం. అక్కడ దీని తల్లి ఉంటే ఈ పిల్లను అక్కడే వదిలేసి వద్దాం. లేకపోతే మనతో ఇంటికి తెచ్చుకుందాం' అని అమ్మ అంటుంది. కుక్కపిల్లను తీసుకుని అమ్మ, జాను పార్కుకు వెళతారు. అక్కడ ఒక కుక్క ఉంటుంది. దానిని చూడగానే జాను చేతుల్లో ఉన్న కుక్క పిల్ల ఒక్క దుముకు దూకి పరిగెత్తుకుంటూ ఆ కుక్క దగ్గరకు వెళుతుంది. కుక్క, కుక్కపిల్ల ఆడుకుంటూ ఉంటాయి. అది చూసి జానుకి చాలా సంతోషం వేస్తుంది. అప్పుడు జాను అమ్మని పట్టుకొని 'థ్యాంక్యూ అమ్మా నీ వల్లే ఈ కుక్క పిల్ల దాని అమ్మ దగ్గరకు వెళ్లింది' అంటుంది. జాను ఆనందాన్ని చూసిన అమ్మ జానుని దగ్గరకి తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోతారు.

యు. రుష్మిక,
5వ తరగతి, రంగాపురం, రెడ్డిగూడెం మండలం.










