Oct 05,2023 21:20
  • ఫోర్బ్స్‌-2023 సంపన్నుల జాబితా వెల్లడి
  • దేశంలో 169 మంది బిలియనీర్లు
  • టాప్‌లో ముకేష్‌ అంబానీ..
  • అదానీకి హిండెన్‌బర్గ్‌ దెబ్బ

న్యూఢిల్లీ : భారత్‌లో అధిక ధరలతో ప్రజల ఆదాయాలు పడిపోతుంటే.. మరోవైపు కుబేరుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రముఖ అమెరికన్‌ మాగ్జిన్‌ ఫోర్బ్స్‌ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితా-2023ను ప్రకటించింది. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ 37వ ఎడిషన్‌ జాబితాలో భారత్‌ నుంచి 169 మంది బిలియనీర్లు గుర్తించబడ్డారు. గతేడాది ఈ సంఖ్య 166గా ఉంది. కనీసం రూ.8వేల కోట్ల పైబడిన వారిని బిలియనీర్‌గా పేర్కొంటారు. దేశంలో మెజారిటీ సాధారణ ప్రజల ఆదాయాలు పడిపోయి.. కనీస పొదుపు కూడా చేయలేని స్థితిలోకి జారుకోగా.. మరోవైపు సంపన్నులు పెరగడం ఆందోళనకరం. ఇది తీవ్ర ఆర్థిక అసమానతలకు నిదర్శనమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలక పక్షం మద్దతుతో అదానీ, అంబానీల ఆదాయాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది జాబితాలో దేశంలో ముకేష్‌ అంబానీ అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ స్థాయిలో అంబానీ 90.5 బిలియన్‌ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) సంపదతో 11 ర్యాంక్‌ను పొందారు. తర్వాత స్థానంలో గౌతం అదానీ 54.6 బిలియన్‌ డాలర్ల (రూ.4.55 లక్షల కోట్లు)తో రెండో స్థానంలో నిలువగా.. గ్లోబల్‌గా 23వ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోల్చితే అదానీ స్థానం, ఆదాయం భారీగా తగ్గింది. అదానీ కంపెనీల ఆర్థిక మోసాలు, కృత్రిమంగా షేర్ల ధర పెంపు అంశాలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌ దెబ్బకు గౌతం అదానీ ఆదాయం భారీగా క్షీణించింది. గతేడాది అదానీ 3వ ర్యాంక్‌లో ఉన్నారు.
ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ స్థాయి కుబేరుల జాబితాలో టెస్లా, ట్విట్టర్‌ అధినేత అయినా ఎలన్‌ మస్క్‌ 240.7 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్‌ వీటన్‌ బ్రాండ్‌ ఫౌండర్‌ బెర్నార్డ్‌ జీన్‌ అర్నాల్ట్‌ 231.4 బిలియన్లతో రెండో స్థానంలో నిలిచారు. 154.9 బిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ మూడో స్థానంలో ఉన్నారు. తర్వాత స్థానాల్లో లారీ ఎల్సన్‌, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, మైకెల్‌ బ్లూమ్‌బర్గ్‌ తదితరులున్నారు.

table