
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : అధిక వర్షాల కారణంగా మండల పరిధిలోని పెదపరిమి కోటేళ్ళ వాగు పొంగి ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నీరు కోటేళ్ళవాగులోకి చేరుతుండడంతో ఆర్‌అండ్‌బి రోడ్డుపై నుంచి దిగువకు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
రాజధాని రాకపోకలకు ఇబ్బంది..?
అధిక వర్షాల కారణంగా రాజధాని అమరావతికి రాకపోకలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.గుంటూరు, పరిసర ప్రాంతాల నుంచి సచివాలయం,హైకోర్టుకు ఉద్యోగులు,సిబ్బంది తమ వాహనాలు,బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. కోటేళ్ళవాగులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి పొంగిలో లెవెల్ ఛఫ్టా మీదుగా ఆర్ అండ్ బి రోడ్డు పై ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గతం లోనూ అధిక వర్షాల కారణంగా రాజధాని అమరావతికి రాకపోకలకు ఆటంకం ఏర్పడటం తెలిసిందే.

చేలల్లోకి చేరిన నీరు..
పెదపరిమిలోని కోటేళ్ళ వాగు పొంగి ప్రవహిస్తుండడంతో సమీపంలోని చేలల్లోకి వర్షం నీరు చేరింది. పత్తి, మిరప చేలల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. రాజధాని నిర్మాణం నుంచి మినహాయించడంతో పెద పరిమి, వడ్డమాను, హరిశంద్రపురంలో పంటల సాగు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.