మేం ఉదయాన్నే కాఫీ తాగుతాం
ప్రపంచ బ్యాంకు అప్పు పుచ్చుకున్నంత ఆనందంగా
మేం ప్రభాతనడక కూడ చేస్తాం
రింగ్ రోడ్డు చుట్టూ చెమట పట్టేంత వరకూ
స్నానం గురించిన చింత చీమంతైనా లేదు
ఇన్ని ప్రాజెక్టుల శంకుస్థాపనల సాక్షిగా..
విపక్షాలది వొట్టి లొల్లి కేళే గాని
సానుకూల దృక్పథం కోల్పోయిన ప్రగతివాదులు వీళ్ళు
కాంట్రాక్టులన్నాక కొన్ని మర్యాదలుంటాయి
ఇంటల్లుడి గౌరవానికి లోటు రాకూడదు
మేనమామ హక్కులకి భంగం వాటిల్లరాదు
కన్నాం కాబట్టి పిల్లల్ని గూర్చి ఆలోచించాల్సిందే
కాదన్నదెవరు..?
ప్రజాస్వామ్యం అంటే పంచుకోవడమే కదా-
భూములైనా కాంట్రాక్టులయినా
కొల్లగొట్టే చౌరస్తాలయినా
ఎంతకీ ఎర్రగడ్డల రాజకీయాలేనా-
చర్చించడానికి సమస్యలు చాల వున్నాయి
గోదావరి కొత్తపాయ పారుతుంది
ఆలస్యమైన ప్రాజెక్ట్ కుండకు చిల్లిపడింది
సామూహిక శత్రువు కొండనాల్క పెరిగింది
తోకపట్టి వెనక్కి లాగితే ఏం ప్రయోజనం..?
ఆర్ధికమండళ్ళు వెల్లివిరిస్తేనే కదా
స్విస్ బ్యాంకులో శ్రీమహాలక్ష్మి విప్లవ తాండవం..!
- డాక్టర్ పెరుగు రామకష్ణ
98492 30443










