Oct 26,2023 15:16

హైదరాబాద్‌: కేసీఆర్‌ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనేది తన ఆశయమని, మరో ఐదు వారాల్లో ఇది నెరవేరుతుందని భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.శుక్రవారం కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఇరువురు దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. అనంతరం రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్‌లో తిరిగి చేరుతున్నానన్నారు. మునుగోడు నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీ ఆదేశిస్తే కనుక తాను గజ్వేల్‌ లేదా కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నారు. కేసీఆర్‌ కుటుంబం దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణ మరో ఐదు వారాల్లో విముక్తమవుతుందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా మునుగోడుతో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేసే అంశంపై రాజగోపాల్‌ రెడ్డి చర్చించారు. ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతఅత్వంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.