విజయవాడ: జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, చేస్తోన్న సామాజిక అన్యాయంపై టిడిపి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గత 53 నెలల వైసిపి ప్రభుత్వ అరాచక పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయంటూ గవర్నర్‌కు లోకేశ్ వివరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను గవర్నర్‌కు నేతలు నివేదించారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన విషయాన్ని ఆయన దఅష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి.. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నేతలు వివరించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరులు గవర్నర్‌కు నివేదించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టిడిపినేతల బఅందం ఆయనకు విజ్ఞప్తి చేసింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబు తదితరులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.