Oct 20,2023 09:28

వరుసగా నాల్గో గెలుపుతో టాప్‌లోకి..
పూణే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. మహరాష్ట్ర క్రికెట్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌ గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 256పరుగులు చేయగా.. ఛేదనలో టీమిండియా 41.3ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి 261పరుగులు చేసి గెలిచింది. శుభ్‌మన్‌(53) అర్ధసెంచరీకి తోడు విరాట్‌ కోహ్లి(103నాటౌట్‌) సెంచరీతో కదం తొక్కారు. కోహ్లి సెంచరీకి చేరువైన క్రమంలో కొంత ఉత్కంఠ నెలకొంది. విజయానికి టీమిండియా ఒక్క పరుగు చేయాల్సి ఉండగా.. కోహ్లి సెంచరీ పూర్తయ్యేందుకు రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ దశలో కోహ్లి సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. తొలుత బంగ్లా జట్టు ఓపెనర్లు రాణించినా.. మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ తడబడ్డారు. బంగ్లా ఓపెనర్లు తాంజిద్‌ హసన్‌(51; 43బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు), లిటన్‌ దాస్‌ (66, 82బంతుల్లో 7 ఫోర్లు) తొలివికెట్‌కు ఏకంగా 93పరుగులు జతచేశారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత కెప్టెన్‌ షాంటో(8), మెహిదీ హసన్‌(3), తౌహిద్‌ హిందారు(16) నిరాశపరిచారు. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌ ముష్ఫీకర్‌ రహీమ్‌ (38, 46 బంతుల్లో ఫొర్‌, సిక్సర్‌)కి తోడు చివర్లో మహ్మదుల్లా (46; 36బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ గైర్హాజరీతో బంగ్లాదేశ్‌కు నజ్ముల్‌ హౌసెన్‌ శాంతో సారథిగా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌ జట్టు తొలి వికెట్‌ను 93 పరుగుల వద్ద కోల్పోయింది. కెప్టెన్‌ శాంతో(8)ను జడేజా పెవిలియన్‌కు పంపగా.. ప్రమాదకరంగా మారుతున్న మెహిది హసన్‌ మిరాజ్‌ను సిరాజ్‌ రెండో స్పెల్‌లో తొలి బంతికే ఔట్‌ చేశాడు. ఇక లిటన్‌ దాస్‌(66)ను జడేజా పెవలియన్‌కు పంపడంతో బంగ్లా ఆత్మరక్షణలో పడింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, జడేజాకు రెండేసి, కుల్దీప్‌, శార్దూల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
ఛేదనలో టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్‌, రోహిత్‌ కలిసి తొలి వికెట్‌కు 88పరుగులు జతచేశారు. అర్ధసెంచరీకి చేరువైన దశలో రోహిత్‌(48) హసన్‌ మహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌(53) అర్ధసెంచరీని పూర్తి చేసుకొని పెవీలియన్‌బాట పట్టాడు. ఆ తర్వాత శ్రేయస్‌(19) నిరాశపరిచినా.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లికి లభించగా.. ఈ గెలుపుతో భారత్‌ వరుసగా నాల్గో గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
పాకిస్తాన్‌ × ఆస్ట్రేలియా
(వేదిక: బెంగళూరు; మ.2.00గం||లకు)
స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ హసన్‌ (ఎల్‌బి)కుల్దీప్‌ 51, లింటన్‌ దాస్‌ (సి)శుభ్‌మన్‌ (బి)జడేజా 66, షాంటో (ఎల్‌బి)జడేజా 8, మెహిదీ హసన్‌ (సి)కేఎల్‌ రాహుల్‌ (బి)సిరాజ్‌ 3, తౌహిద్‌ హిండే (సి)శుభ్‌మన్‌ (బి)శార్దూల్‌ 16, ముష్ఫికర్‌ రహీమ్‌ (సి)జడేజా (బి)బుమ్రా 38, మహ్మదుల్లా (బి)బుమ్రా 46, నసుమ్‌ అహ్మద్‌ (సి)కేఎల్‌ రాహుల్‌ (బి)సిరాజ్‌ 14, ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 1, షోరిఫుల్‌ (నాటౌట్‌) 7, అదనం 6. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 256పరుగులు.
వికెట్ల పతనం: 1/93, 2/110, 3/129, 4/137, 5/179, 6/201, 7/233, 8/248
బౌలింగ్‌: బుమ్రా 10-1-41-2, సిరాజ్‌ 10-0-60-2, హార్దిక్‌ 0.3-0-8-0, కోహ్లి 0.3-0-2-0, శార్దూల్‌ 9-0-59-1, కుల్దీప్‌ 10-0-47-1, జడేజా 10-0-38-2,
ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)తౌహిద్‌ (బి)హసన్‌ మహ్మద్‌ 48, శుభ్‌మన్‌ (సి)మహ్మదుల్లా (బి)హసన్‌ మిరాజ్‌ 53, విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 103, శ్రేయస్‌ అయ్యర్‌ (సి)మహ్మదుల్లా (బి)మెహిదీ హసన్‌ 19, కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 34, అదనం 4. (41.3 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 261పరుగులు.
వికెట్ల పతనం: 1/88, 2/132, 3/178
బౌలింగ్‌: షోరిఫుల్‌ ఇస్లామ్‌ 8-0-54-0, ముస్తాఫిజుర్‌ రహమాన్‌ 5-0-29-0, నసూమ్‌ అహ్మద్‌ 9.3-0-60-0, హసన్‌ మహ్మద్‌ 8-0-65-1, మెహిదీ హసన్‌ 10-0-47-2, మహ్మదుల్లా 1-0-6-0