Oct 02,2022 07:48

ప్రజాశక్తి ప్రతినిధి - తిరువనంతపురం : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ (69) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొడియేరి బాలకృష్ణన్‌ కన్నుమూశారన్న వార్తతో కేరళలో విషాద వాతావరణం నెలకొంది. సుదీర్ఘకాలం ప్రజాజీవితం లోనూ, పోరాటాల్లోనూ ఆయన నిర్వహించిన పాత్రను కేరళ ప్రజానీకం గుర్తుచేసుకుంటోంది. ఆయన మరణవార్త తెలియగానే కేరళ రాష్ట్ర సిపిఎం కార్యాలయం ఎకెజి భవన్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల వద్ద పార్టీ పతాకాలను అవనతం చేశారు. దేశ వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద ఆదివారం నుండి మూడు రోజుల పాటు పార్టీ పతాకాలను అవనతం చేయనున్నారు. కొడియేరి బాలకృష్ణన్‌ మృతి పట్ల సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీద్ర సంతాపాన్ని తెలియచేశారు. కొడియేరి నమ్మిన విలువల కోసం చివరివరకు కట్టుబడి ఉన్నారని, విఛ్చినకరశక్తుల పైన, మతోన్మాదం పైన రాజీలేని పోరాటం సాగించారని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ 'నా ప్రియమైన సహచరుడు... మిత్రుడు కొడియేరి మరణం కలచివేసింది. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. పోరాటాల్లో ఆయన మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. రెడ్‌ సెల్యూట్‌ కామ్రేడ్‌' అని నివాళులర్పించారు. కొడియేరి మరణవార్త తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అపోలో ఆస్పత్రికి వెళ్లి, భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొడియేరి బాల కృష్ణన్‌ అంత్యక్రియలు కన్నూరులోని పాయంబాలం బీచ్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌తో పాటు, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, సినీ నటులు సంతాపాలు తెలిపిన వారిలో ఉన్నారు.

 

బ


 

                                                                 రాష్ట్ర కమిటీ సంతాపం .. నేడు సభ

కొడియేరి బాలకృష్ణన్‌ మృతిపట్ల సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. కొడియేరి మృతికి సంతాప సూచికంగా రాష్ట్రంలో అన్నిపార్టీ కార్యాలయాల వద్ద అరుణపతాకాలు మూడు రోజులపాటు అవనతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో సంతాపసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకృష్ణన్‌ మృతి సిపిఎంకు, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లూ సంతాపం ప్రకటించారు.
 

                                                                               పోరాట యోధుడు

కన్నూరులోని కొడియేరి గ్రామంలో ఉపాధ్యాయుడు కుంజున్ని కురుప్‌, నారాయణమ్మ దంపతులకు 1953 నవంబర్‌ 16న జన్మించిన బాలకృష్ణన్‌ ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. చిన్న వయస్సులోనే ఉద్యమాల పట్ల ఆకర్షితులై భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ), అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ)లలో పలు బాధ్యతలు నిర్వహించి విద్యార్థి, యువజన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు యుక్త వయస్సులోనే సిపిఎంలో చేరారు. ఎమర్జెన్సీ కాలంలో కొడియేరి 16 నెలల పాటు జైల్లో ఉన్నారు.తలస్సేరి ప్రాంతంలో మతోన్మాదులు చెలరేగినప్పుడు ముందువరుసన నిలబడి వారి ఆగడాలను అడ్డుకున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ప్రజాపోరాటాల్లోనూ ముందుండేవారు. లాఠీ దెబ్బలకు, అరెస్ట్‌లకు ఏనాడు వెనుకంజ వేయలేదు. ఈ చొరవే ఆయన్ను మాస్‌ లీడర్‌గా, పోరాటయోధుడిగా ప్రజానీకంలో గుర్తింపునిచ్చింది. 1988లో ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడిగానూ, 1995లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడయ్యారు. 2008లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. 2015, 2018లలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఐదుమార్లు తలస్సేరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వంలో రాష్ట్ర హోంమంత్రిగా విధులు నిర్వర్తించారు. కేరళ రాష్ట్ర కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశారు.