May 29,2023 08:21

ఎన్నేళ్ళు ఎన్ని ఎన్నికలు జరిపినా
ఏ కార్పొరేట్ల పార్టీ అధికారం చేపట్టినా
కష్టజీవుల కడుపు సంచిని సగం కత్తిరించి
సగానికే 'సంక్షేమం' లేపనం రాశారు
అమ్మ భారతికి అబద్ధాల హారతులిస్తూ
గద్దెలన్నీ పెట్టబడులకు కాపలాలు కాశాయి
నిజాలను ఎంత లోతులో పాతి పెట్టినా
అవి మొలకెత్తకుండా ఎంత కాలం ఆపగలరు?
నిజం ... నిజమే చెబుతున్నా
ఎన్ని అరచేతులు అడ్డుపెట్టినా
కలకాలం సాగదు
ఈ పెట్టుబడుల కోలాటం
పండరి భజనల కులుకు నృత్యం

కాలం కడుపు
సోషలిజాన్ని ప్రసవించిన రోజు
కష్టజీవులు కిరీటాలతో వస్తారు
వృత్తిదారులు కొత్త దుస్తులు ధరిస్తారు
మధ్య తరగతి
మంగళ వాయిద్యాలు వాయిస్తుంది
వ్యాపార వర్గాలు
పూల రథాలతో స్వాగతిస్తాయి
ఇది తట్టుకోలేక కార్పొరేట్లు
కత్తులతో తలలు నరుక్కు చస్తారు
సూర్యుడు మండే ఎండతో
తెగిపడిన తలలకు చితులు వెలిగిస్తాడు
కాలం దొర్లి కొత్త వ్యవస్థలో కొలువు దీరుతుంది
 

- ఉన్నం వెంకటేశ్వర్లు
87900 68814