May 15,2023 07:50

మనం ఫ్రాంజ్‌ కాఫ్కా యొక్క ద్ణుఖం
నీషే తత్వం
దోస్తోవ్‌ స్కీ అన్వేషణ
ఎమిల్‌ సియోరాన్‌ అమరత్వం
ఆల్బర్ట్‌ కామూ యొక్క మానవత
మరియు కార్ల్‌ మార్క్స్‌ యొక్క కల
ఇంకా అజ్ఞాత కవి రాసిన విషాద రాతలం
మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న
సంగీతకారుడి విషాదపు గీతాలం
వణుకుతున్న చేతితో వాన్‌ గోగ్‌ గీసిన గీతలం మనందరం

గాంధీ చెప్పినట్టు చెంపదెబ్బలు తింటున్నవాళ్ళం
సందుల్లో విషాదపు గోడలం
భయంతోనూ, ఒత్తిడితోను ఉన్న ప్రతి ఒక్కరు
సరదాగా గడిపినవాళ్ళ ఉపన్యాసాలలో
చివరి వరుసలో కూర్చొని
మన ఉనికిని గుర్తించేవాళ్ళం

మనం రాత్రికి స్నేహితులం
బాధలు, నిజాలు ఎవరికీ తెలియనివ్వనివాళ్ళం
సినిమాలో విషాదకరమైన సన్నివేశం చూసి ఏడ్చేవాళ్ళం
ఒంట్లో నెత్తురు తక్కువైనవాళ్ళం
మనకేం కావాలో కూడా తెలియని ప్రాచీన మెదడులం
ఇంకా స్థిరపడలేకపోతున్నాం!
మనం ఐక్యత గురించి తెలిసిన
అంబేద్కర్‌ రచనల్లో మాత్రమే కలుసుకునే ఒంటరివాళ్ళం!
 

- శాంతయోగి యోగానంద