Oct 23,2023 10:07
  • నాలుగు వికెట్లతో భారత్‌ గెలుపు
  • కోహ్లి శతకం మిస్‌, రోహిత్‌, జడేజా మెరుపులు
  • ప్రపంచకప్‌ 2023

ధర్మశాల : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర సాగుతోంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం విజయం సాధించి వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కివీస్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఆరు వికెట్లు కోల్పోయి, ఇంకా రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. విరాట్‌ కోహ్లీ (95, 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (39, 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తోడు, అంతకు ముందు రోహిత్‌ శర్మ (46, 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించడం భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 2003 ప్రపంచకప్‌ తరువాత న్యజిలాండ్‌పై భారత్‌ గెలవడం ఇదే మొదటిసారి. అలాగే 2019 కప్‌లో సెమీస్‌లో ఎదురైన ఓటమికి భారత్‌ బదులు తీర్చుకున్నట్లయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో చేరుకుంది.
           ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. డారిల్‌ మిచెల్‌ (130, 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం బాదాడు. రచిన్‌ రవీంద్ర (75, 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా భారీ ఇన్సింగ్స్‌ ఆడాడు. షమి ఐదు వికెట్లతో అదరగొట్టగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు, బుమ్రా, సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.
         లక్ష్య సాధనలో రోహిత్‌- శుభ్‌మన్‌ గిల్‌ (26) జోడీ ధాటిగానే ఆడింది. అయితే జట్టు స్కోరు రోహిత్‌ 71 తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. 76 పరుగులు వద్ద గిల్‌ అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో వేగంగా 2 వేలు పరుగులు (38 ఇన్నింగ్స్‌లు) చేసిన ఆటగాడిగా గిల్‌ ఆవతరించాడు. ఒక వైపు కోహ్లి పరుగులు చేస్తున్నా మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (27) భారీ స్కోర్లు చేయలేకపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (2) ఘోరంగా విఫలమయ్యాడు. 191 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను కోహ్లీ, జడేజా జోడి ఆదుకుంది. అయితే 269 వద్ద కోహ్లి అవుటయ్యాడు. తరువాత షమీ (1)తో కలిసి జడేజా ఆట పూర్తి చేశాడు.. కివీస్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, మిచెల్‌ శాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ తలో వికెట్‌ పడగొట్టారు.
 

                                                             ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ షమి

ఈ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచులకు బెంచ్‌కు పరిమితమైన మహ్మద్‌ షమి.. అవకాశం దక్కిన ధర్మశాలలో దుమ్మురేపాడు.
న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమి (5/54) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. షమి 2019 ప్రపంచకప్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్‌ల్లో మొత్తంగా భారత బౌలర్లకు ఇది తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శన.

ప్రపంచకప్‌లో నేడు
అఫ్గనిస్థాన్‌ × పాకిస్థాన్‌
వేదిక : చెన్నై

ప్రపంచకప్‌లో రేపు
బంగ్లాదేశ్‌ × దక్షిణాఫ్రికా
వేదిక : ముంబయి

సమయం : మ|| 2 నుంచి