Oct 08,2023 22:12

వరుస మ్యాచ్‌లకు సిద్ధమైన ఉప్పల్‌ స్టేడియం

హైదరాబాద్‌ : డిఫెండింగ్‌ చాంపియన్‌ను ఆరంభ మ్యాచ్‌లో చిత్తుగా ఓడించిన జట్టు ఓ వైపు.. అర్హత టోర్నీలో రాణించి ప్రపంచకప్‌కు చేరుకున్న పసికూన మరోవైపు. ఉప్పల్‌ స్టేడియం ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో వరుస మ్యాచుల ధమాకాకు సిద్ధమైంది. 2015, 2019 ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో పసికూన నెదర్లాండ్స్‌ రేపు తలపడనుంది. రేపు మధ్యాహ్నాం 2 గంటలకు కివీస్‌, డచ్‌ పోరు ఆరంభం కానుంది.
కివీస్‌కు ఎదురుందా? : ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏకపక్ష విజయం సాధించింది. బలమైన ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు డెవాన్‌, రచిన్‌ రవీంద్రలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో లేకపోయినా.. న్యూజిలాండ్‌ అదరగొట్టింది. నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులోకి వస్తే డచ్‌ జట్టు కష్టాలు రెట్టింపు కానున్నాయి. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో న్యూజిలాండ్‌ బలంగా ఉంది. హైదరాబాద్‌ పిచ్‌, పరిస్థితులపై విలియమ్సన్‌ సహా కివీస్‌ ఆటగాళ్లకు సైతం మంచి అవగాహన ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంఛైజీకి సారథ్యం వహించిన కేన్‌ విలియమ్సన్‌ ఉప్పల్‌ స్టేడియాన్ని రెండో సొంత మైదానం చేసుకున్నాడు. నేడు హైదరాబాద్‌ అభిమానుల నడుమ కేన్‌ విలియమ్సన్‌ చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక నెదర్లాండ్స్‌ సైతం మరీ తీసికట్టుగా ఆడటం లేదు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై డచ్‌ ఆటగాళ్లు గొప్పగా ఆడారు. ఆరంభంలో, చివర్లో పాకిస్థాన్‌ బ్యాటర్లను చెక్‌ పెట్టారు. మిడిల్‌ ఓవర్లలో పార్ట్‌ టైమ్‌ బౌలర్లు డచ్‌ను కాస్త వెనుకంజలో నిలుపుతున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ అదే స్ఫూర్తితో మెరిసేందుకు నెదర్లాండ్స్‌ సిద్ధమవుతోంది.