Nov 28,2022 09:11
  • లక్షల మందికి పిఎం కిసాన్‌ దూరం చేస్తున్న కేంద్రం
  • భరోసాతో లింక్‌ ఉన్నా అడగని రాష్ట్ర సర్కారు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం కిసాన్‌)ని పొందుతున్న మన రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ కోతలకు గురవుతోంది. కిస్తుకు రూ.రెండు వేల చొప్పున మూడు కిస్తులకూ కలిపి ఏడాదికి రూ.ఆరు వేలు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ కావాలి. కాగా కిస్తు కిస్తుకు లబ్ధి పొందే రైతులు తగ్గిపోతున్నారు. మోడీ ప్రభుత్వం విధిస్తున్న కొత్త కొత్త నిబంధనల వలన అన్నదాతలు చిన్నపాటి సర్కారీ సాయానికీ దూరమవుతున్నారు. సంవత్సరంలో నాలుగు మాసాలను ఒక పిరియడ్‌గా పేర్కొని ఒక్కో పిరియడ్‌కు రూ.రెండు వేల వంతున నగదు బదిలీ చేస్తున్నారు. ఏప్రిల్‌-జులై, ఆగస్టు-నవంబర్‌, డిసెంబర్‌-మార్చి గా వర్గీకరించారు. నిరుడు 2021-22 చివరన డిసెంబర్‌-మార్చి కాలానికి ఆంధ్రప్రదేశ్‌లో 47,64,482 మందికి రూ.రెండు వేల చొప్పున జమ పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 తొలి కిస్తు ఏప్రిల్‌-జులై కి 46,62,768 మందికి సొమ్ము పడింది. అంతకుముందు కిస్తు పొందిన వారిలో ఈ ఏడాది తొలి కిస్తు 1,01,714 మందికి పడలేదు. ఈ తగ్గుదల ఇలా ఉండగా ఈ సంవత్సరం రెండవ కిస్తు 42,02,640 మందికే జమ అయింది. మొదటి కిస్తు కంటే 4,60,128 మంది లబ్ధి దారులు తగ్గిపోయారు. రెండవ కిస్తు పడాల్సిన సమయం జులై-నవంబర్‌. నవంబర్‌ నెల ముగియడానికి నాలుగు రోజులే సమయముంది. దాంతో లక్షల మంది రైతన్నలు పిఎం కిసాన్‌ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులరిగిపోయేలా తిరుగుతున్నారు.
 

                                             ఎప్పుడూ లేదు

గత సార్వత్రిక ఎన్నికల ముంగిట 2018 డిసెంబర్‌ నుంచి పిఎం కిసాన్‌ పథకం మొదలుకాగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడూ నమోదు చేసుకున్న రైతులందరికీ సొమ్ము పడలేదు. ఎపిలో 60,66,195 మంది రిజిస్టర్‌ చేయించుకోగా వారిలో దాదాపు 10-15 లక్షల మందికి అందట్లేదు. కేంద్రం కౌలు రైతులకు మొత్తానికే సాయం చేయనంది. కేవలం స్వంత భూమి కలిగిన రైతులకే లబ్ధి అంది. ఆదాయపన్ను చెల్లించేవారిని, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్‌ను, ప్రభుత్వ ఉద్యోగులను, పెన్షన్‌ తీసుకునేవారిని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని, మాజీలను అనర్హులుగా ప్రకటించింది. రెవెన్యూ రికార్డులు, ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ అంది. ఇప్పుడేమో ఇ-కెవైసి తప్పనిసరి చేసింది. రోజుకో షరతు పెట్టడంతోపాటు సాంకేతిక సమస్యల కారణంగా లక్షల మంది రైతులు లబ్ధి పొందలేకపోతున్నారు.
 

                                         నవరత్నానికి బీటలు

ప్రతి ఏడాదీ ఖరీఫ్‌కు ముందే 'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా' పేరిట రూ.12,500 ఒకేసారి రైతు చేతిలో పెడతామని ఎన్నికల ముందు వైసిపి హామీ ఇచ్చింది. అధికారంలోకొచ్చాక సాయాన్ని రూ.13,500 చేసి, కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తోంది. ఒకేసారి కాకుండా సంవత్సరంలో మూడు కిస్తుల్లో ఇస్తోంది. కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500గా లెక్క చెప్పింది. కేంద్ర నిబంధనల వలన పిఎం కిసాన్‌ లబ్ధి లక్షలాది మంది రైతులకు అందట్లేదు. రాష్ట్రం ఇచ్చే రూ.7,500 మాత్రమే జమ అవుతున్నాయి. కొంత మందికి రెండు సాయాలూ పడట్లేదు. రాష్ట్ర సర్కారు లబ్ధిదారుల జాబితాలు కేంద్రానికి పంపినా అక్కడ ఆగిపోతున్నాయి. లక్షల మందికి 'పిఎం కిసాన్‌' పడకపోయినా కేంద్రాన్ని ఎపి సర్కారు గట్టిగా అడగట్లేదని విమర్శ్లలొస్తున్నాయి.

11