Oct 09,2023 09:16
  • 14 లక్షల రైతులు ఔట్‌
  • రాష్ట్రం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో భారీ కోత
  • ఉలకని ఎపి సర్కారు
  • తన వాటాతో సరి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కేంద్రం విధించిన కఠిన ఆంక్షల మూలంగా నవరత్నాల్లో భాగంగా వ్యవసాయదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా లబ్ధిదారులకు భారీగా కోత పడుతోంది. ఈ నెల రెండవ పక్షంలో కేంద్రం విడుదల చేయనున్న 15వ కిస్తు (ఈ సంవత్సరంలో రెండవ కిస్తు) పెట్టుబడి సాయాన్ని దాదాపు 14 లక్షల మంది కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రమే అర్హత సాధించిన లబ్ధిదారులందరికీ ఈ సంవత్సరం వేసే రెండవ కిస్తు రూ.2 వేలు జమ కానున్నాయి. వివిధ దశల్లో కేంద్రం నిర్వహించిన వడపోతల తర్వాత సుమారు 14 లక్షల మంది లబ్ధిదారులు కేంద్రం నుంచి వచ్చే రూ.రెండు వేలు కోల్పోతున్నారు. కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో కలిపి రైతు భరోసాను ఎ.పి. అమలు చేస్తున్నందున ప్రభుత్వాలు అందించే అరకొర ఆర్థిక సహాయాన్నీ లక్షలాదిగా కోల్పోవాల్సి రావడంపై రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన బయలుదేరింది.
 

                                                                                 వాటితోనే తంటా

పిఎం కిసాన్‌ సహాయానికి కేంద్రం కొత్తగా మూడు తప్పనిసరి నిబంధనలు విధించింది. సొంత భూమి కలిగిన రైతు ల్యాండ్‌ సీడింగ్‌ (లింకేజి), ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ (ఎబిపిఎస్‌), ఇ-కెవైసి చేయించుకోవాలి. ఈ మూడింటిలో ఏది లేకపోయినా కేంద్రం నుంచి పిఎం కిసాన్‌ సహాయం పడదు. ఇదిలా ఉండగా రైతులకు ప్రతి ఏటా వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రూ.13,500 ఇస్తామని వైసిపి హామీ ఇచ్చింది. తదుపరి కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో లింక్‌ చేసింది. ఇస్తామన్న సహాయంలో కేంద్రం నుంచి రూ.ఆరు వేలొస్తే తాను రూ.7,500 ఇస్తానంది. అది కూడా ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు మాసాలకోమారు ఏడాదిలో మూడు వాయిదాల్లో ఇస్తామంది. ఈ సంవత్సరం ఖరీఫ్‌కు ముందు జూన్‌ ఒకటో తేదీన రాష్ట్ర సర్కారు తన వాటా రూ.5,500 విడుదల చేసింది. ఆ తర్వాత ఎప్పటికో కేంద్రం తన వాటా రూ.2 వేలు జమ చేసింది. కాగా ఈ ఏడాది రెండవ కిస్తు రూ.2 వేలు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్న కేంద్రం, నిబంధనలపై గట్టిగా పట్టుపట్టింది. ఇదిలా ఉండగా కౌలు రైతులు కాకుండా సొంత భూమి కలిగిన రైతుల్లో 52,30,639 మందిని భరోసాకు అర్హులుగా నిర్ధారించి వారందరికీ రాష్ట్రం తన వాటా విడుదలకు సన్నద్ధమవుతుండగా, పిఎం కిసాన్‌కు మాత్రం 40,36,694 మందినే కేంద్రం మిగతా 2లో అర్హులుగా పేర్కొంది. వారిలో 39,83,277 మందికి ల్యాండ్‌ సీడింగ్‌ పూర్తయింది. 53,417 మంది ల్యాండ్‌ సీడింగ్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ల్యాండ్‌ సీడింగ్‌ కంప్లీట్‌ అయిన వారిలో 39,24,505 మందికే ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ కంప్లీట్‌ అయింది. 58,772 మంది ఎబిపిఎస్‌ పెండింగ్‌లో ఉంది. ఇక ఎబిపిఎస్‌ పూర్తయిన వారిలో 39,02,570 మందికే ఇ-కెవైసి పూర్తయింది. 21,935 మంది ఇ-కెవైసి పెండింగ్‌లో ఉంది.
 

                                                                              మాట్లాడని ఎపి సర్కారు

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన భరోసా లబ్ధిదారుల సంఖ్యకు, కేంద్ర పథకం పిఎం కిసాన్‌ లబ్ధిదారుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. రాష్ట్ర వాటా సొమ్ము పడ్డ వారిలో లక్షల మందికి కేంద్ర వాటా పడకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పిఎం కిసాన్‌ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను కేంద్రం రాష్ట్రంపైనే పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే అమలు చేస్తున్న పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన లబ్ధిదారుల కంటే కేంద్రం అందించే సాయానికి లబ్ధిదారులు లక్షల్లో తక్కువ ఉండటంపై రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని అడగట్లేదు. తన వాటా మాత్రం విడుదల చేసి గమ్మునుంటోంది. దాంతో ప్రభుత్వం ఇస్తామన్న అరకొర సాయాన్ని కూడా రైతులు కోల్పోవాల్సి వస్తోంది.

11