Jan 11,2021 21:25

న్యూఢిల్లీ : దాదాపు 20 లక్షల మందికి పైగా అనర్హులకు, ఆదాయ పన్ను చెల్లించే వారికి కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్‌ లబ్ధి వెళ్లింది. ఇందులో రూ.1,364 కోట్ల చెల్లింంపులు అయినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆర్‌టిఐ ద్వారా ఇచ్చిన సమాధానంలో తేలింది. పిఎం కిసాన్‌ పథకం కింద నమోదైన లబ్ధిదారులు మొత్తం 11 కోట్ల మంది వున్నారు. 2020 జులై నాటికి 20.5 లక్షల మంది అనర్హులకు పొరపాటున ఈ చెల్లింపులు జరిగాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఇలా అనర్హులకు చెల్లింపులు జరిగిన రాష్ట్రాల్లో పంజాబ్‌ అగ్రస్థానంలో వుంది. దాదాపు 23 శాతం మంది లబ్ధి అందుకున్నారు. మహారాష్ట్ర, అసోంలలో కూడా పెద్ద సంఖ్యలోనే ఇటువంటి చెల్లింపులు జరిగాయి. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో 8 శాతం చొప్పున ఈ చెల్లింపులు జరిగాయి. ఇలా తప్పుగా జరిగిన చెల్లింపుల మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను రాష్ట్రాల వ్యవసాయ శాఖలు చేపట్టాయి.
ఆర్‌టిఐ కార్యకర్త వెంకటేష్‌ నాయక్‌ దాఖలు చేసిన దరఖాస్తుకు వ్యవసాయ శాఖ సమాధానం ఇచ్చింది. కేంద్రం తెలిపిన మొత్తం 20.5 లక్షల మందిలో 56 శాతం మంది ఆదాయపన్ను చెల్లించే కేటగిరీ కిందకు రాగా, మిగిలినవారు అనర్హుల కేటగిరీలోకి వస్తున్నారు. అయితే, ఆదాయపన్ను చెల్లించే వారికి ఇప్పటికే 72 శాతం పిఎం కిసాన్‌ నిధులను ఇచ్చేశారు. వారి అనర్హత బయటపడే వరకు పలు దశల్లో డబ్బులు అందుకున్నారు. విషయం బయటపడిన తర్వాత వారిని లబ్దిదారుల డేటా నుండి తొలగించారు. రైతులకు ఏడాదికి 6 వేల రూపాయిల ఆదాయాన్ని అందించేందుకు కేంద్రం పిఎం కిసాన్‌ పథకాన్ని చేపట్టింది. 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే మొదటగా దీన్ని ఉద్దేశించారు. అనంతరం ఆ నిబంధన తొలగించడంతో పెద్ద రైతులు ఈ పథకంలోకి వచ్చారు. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు వున్నాయి. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి ఆదాయ పన్ను చెల్లించినా, నెలవారీ పెన్షన్‌ రూ.10 వేలు అందుకుంటున్నా, ప్రభుత్వ సర్వీసులో వున్నా లేదా రిటైరైనా, ఆ కుటుంబాలేవీ కూడా ఈ పథకానికి అర్హులు కాదు. వృత్తినిపుణులు, భూస్వాములు కూడా ఈ పథకానికి అర్హులు కారు.