ఇండోర్ : కరోనా మహమ్మారికి సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారుల ఏకంగా 40,000 పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో శనివారం జరిగింది. ఆ డాక్యుమెంట్లను కారులో తరలించాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి ఆర్‌టిఐ చట్టం కింద ఇండోర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌కు ఓ దరఖాస్తు చేశారు. కరోనా సమయంలో ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర మెటీరియల్స్ కోసం జారీచేసిన టెండర్లు, బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగారు. అధికారులు నెలలోపు సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన అప్పీలేట్ అధికారి మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ డా. శరద్ గుప్తాను ఆశ్రయించారు. అభ్యర్థనను అంగీకరించిన శరద్‌గుప్తా.. దరఖాస్తుదారుడికి ఉచితంగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు 40,000 పేజీల్లో సమాచారాన్ని ఇచ్చారు.
డాక్యుమెంట్లను తీసుకువెళ్లేందుకు తన కారును తీసుకురావాల్సి వచ్చిందని, డ్రైవర్ సీటు తప్ప కారు మొత్తం డాక్యుమెంట్లతో నిండిపోయిందని ధర్మేంద్ర శుక్లా తెలిపారు. తన దరఖాస్తుకు అధికారులు నెలలోపు సమాధానం ఇవ్వకపోవడంతో పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందని అన్నారు.
డా. శరద్ గుప్తాను సంప్రదించగా.. సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నిర్దేశిత సమయంలోగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానాకు రూ.80 వేల నష్టం వాటిల్లజేసిన సిఎంహెచ్‌ఒ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.