పుతిన్‌తో భేటీ ?
మాస్కో, ప్యాంగాంగ్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, కిమ్ సమావేశమవుతారని భావిస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ జరిగేది వివరాలు తెలియరాలేదు. కోవిడ్ తర్వాత కిమ్ మొదటి విదేశీ పర్యటన ఇదే. ఆదివారం మధ్యాహ్నం ప్యాంగాంగ్‌లో బయలుదేరిన కిమ్ వ్యక్తిగత రైలు మంగళవారం మధ్యాహ్నం మాస్కో చేరుకుందని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కెసిఎన్‌ఎ తెలిపింది. కిమ్ వెంట ఉత్తర కొరియా పాలక పార్టీ, ప్రభుత్వం, మిలటరీకి చెందిన పలువురు సభ్యులు, అధికారులు ఉన్నారు. దశాబ్దాలుగా ఉత్తరకొరియా, రష్యా మధ్య సంక్లిష్టమైన సంబంధాలు నెలకొన్నప్పటికీ ఉక్రెయిన్ యుద్ధం ఒక రకంగా రెండు దేశాలను దగ్గర చేసిందని చెప్పవచ్చు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధ సరఫరాలపై ఒప్పందం కుదిరే అవకాశం వుంది. దీనిపై పుతిన్, కిమ్ చర్చలు జరపనున్నారు. మరోపక్క క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా కిమ్ రాకను ధ్రువీకరించారు.