
పిల్లల చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో ఎందరో నిత్యం ఒత్తిడికి గురవుతుంటారు. అలసట, గుండెదడ, ఒత్తిడి, పోస్ట్ ట్రామ్టిక్ స్ట్రెస్ డిజార్డర్, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, ఇలా రకరకాల ఇబ్బందులు అనేకమందిని వేధిస్తుంటాయి. అయితే నిత్యం సంఘర్షణలతో జీవిస్తున్న కశ్మీరీ ప్రజల పరిస్థితి సాధారణ ప్రదేశాల్లో నివసిస్తున్న వారికంటే అత్యంత దారుణంగా ఉంటోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో అక్కడి ప్రజలు నలిగిపోతుంటారు. విద్య, ఉపాధి వంటి ఉజ్వల భవిష్యత్తుకు దూరమైన పిల్ల్లలు, వీధుల్లో తుపాకీ మోతలు, పెల్లెట్ల దాడులు, గ్రామంలో మోహరించిన ఆర్మీ బలగాలు, ఆపదలో ఉన్నవారు, అత్యవసర చికిత్స అందించాల్సిన వారు గ్రామం దాటాలంటే కఠిన ఆంక్షలు, తనిఖీల పేరుతో బారులు తీరిన వాహనాల మధ్య గర్భిణీలు, పిల్లల అవస్థలు.. ఇలా భిన్న వాతావరణాన్ని ఏళ్ల తరబడి అనుభవిస్తున్న ఆ పౌరుల మానసిక స్థితి రోజురోజుకూ కుంగిపోతోంది. తాజా సర్వేలో వారి మానసిక ఆరోగ్యంపై వెలుగుచూసిన విషయాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
కాశ్మీర్ లోయలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్‌స్ ఇన్ శ్రీనగర్(ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్)లో మానసిక ఒత్తిడితో ఇబ్బందిపడుతున్న ప్రజల నుండి ఫోన్‌కాల్స్ తీసుకునే టెలీ కేంద్రానికి వచ్చిన ఫోన్‌కాల్స్ వివరాలు ఇలా వున్నాయి. ఆ కేంద్రం ప్రారంభించిన 2022 నవంబరు నుండి ఇప్పటివరకు 26, 477 ఫోను కాల్స్ వచ్చినట్లు జమ్ము-కాశ్మీర్ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ భూపేందర్ కుమార్ ఓ సెమినార్‌లో చెప్పారు. అందులో అత్యధికంగా ఒత్తిడితో బాధపడుతున్నామని 2854 మంది, విచారంగా ఉంటోందని 2,790 మంది, గుండె దడగా ఉందని 2,428 మంది, ఏ విషయంపై శ్రద్ద పెట్టలేకపోతున్నామని, ఆసక్తి తగ్గిపోతోందని 1,931 మంది, అలసటగా ఉంటోందని 1,869 మంది, నిద్రలేమితో బాధపడుతున్నామని 1,601 మంది, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని 799 మంది ఫోను చేసినట్లు ఆయన వివరించారు.
న్యూఢిల్లీలో గత నెల మొదటివారంలో నిర్వహించిన మెంటల్‌హెల్త్ డేలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి హాజరైన టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కేంద్రాలు అందించిన వివరాలలో జమ్మూ నుండి వచ్చిన ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్ అందించిన ఈ వివరాలే అగ్రభాగంలో నిలిచాయి. మానసిక ఆరోగ్య రక్షణలో విశేష కృషి చేసినందుకు ఆ కార్యక్రమంలో ఈ కేంద్రానికి అవార్డు కూడా ఇచ్చారు.
సెమినార్‌లో టెలీ సెంటర్ వెలువరించిన వివరాల ప్రకారం అక్టోబరు మొదటివారంలో కేంద్రానికి వచ్చిన వారిలో యువత, వృద్ధులు, మహిళలు, పిల్లలు విచారవదనాలతో తమ వంతు కోసం వేచివున్నారని తెలిపింది. కాశ్మీర్‌లో సంఘర్షణ మొదలైన నాలుగుదశాబ్దాల్లో ప్రతి తరం ఒత్తిడికి గురవుతుందనడానికి ఇదే ఉదాహరణ అని వివరించింది.
'40 ఏళ్ల మహిళ తన టీనేజ్ కొడుకుని తీసుకుని మానసిక ఆరోగ్యకేంద్రానికి వచ్చినప్పుడు, లోపలికి వెళ్లడానికి అతడు నిరాకరిస్తున్నాడు. 'కేంద్రానికి వచ్చినట్లు తన స్నేహితులకు తెలిస్తే గేలి చేస్తారని అతను భయపడుతున్నటు'్ల ఆమె చెప్పింది. 'చికిత్స తరువాత అలా ఉండదు అని మేము అతనితో చాలా సమయం మాట్లాడినట్లు' వాళ్లకు ఎదురైన ఓ అనుభవం గురించి కూడా సెమినార్‌లో చెప్పారు.
మెంటల్ హెల్త్ ఇన్ కాశ్మీర్ : కోవిడ్ సంక్షోభం పేరుతో 2020లో కాశ్మీర్ లోయలో చేసిన ఓ సర్వేలో దశాబ్దాల తరబడి కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులకు నాలుగు తరాల ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమౌతున్నట్లు తేలింది. ఒత్తిడితో41 శాతం, అలసటతో 26 శాతం, పోస్ట్ ట్రామ్టిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో 19 శాతం, అర్థంకాని ఏదో వెలితితో 47 శాతం మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలింది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, మానసిక ఆరోగ్య పునరావాస కేంద్రాలను వీలైనంత వెంటనే ఏర్పాటు చేసేలా ఈ ఫలితాలు ఉన్నాయని కూడా ఆ నివేదిక తేల్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా 24 గంటలు సేవలు అందించేలా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. అలా కాశ్మీర్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌కి ఏడాది వ్యవధిలోనే ఇన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతకు ముందు నుండే అంటే 1990 నుండి ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్‌కి అనుసంధానంగా మానసిక ఆరోగ్యకేంద్రం అక్కడ నిర్వహించబడుతోంది. అప్పుట్లో వెయ్యిమంది బాధితులు కేంద్రాన్ని సందర్శించినట్లు నివేదికలు ఉన్నాయి. కేంద్రం ప్రారంభించిన ఏడాదికే 1764 మందికి ఆ సంఖ్య పెరిగినట్లు కూడా నమోదైంది.
వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు, తుపాకీ మోతలు, దాడులు, భద్రత లేని బతుకులు రోజురోజుకూ పెరిగిపోయి, 2004 నాటికి ఆ సంఖ్య 62 వేలకు చేరింది. 2017 నాటికి 1,06,743 మంది పౌరులు కేంద్రాన్ని సందర్శించడం ఆందోళన కలిగిస్తున్నా, ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వైద్యున్ని సంప్రదించడం ఆహ్వానించే పరిణామమని అప్పట్లో నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే అక్కడి ప్రజలు తీవ్ర పరిణామాలకు గురౌతారని ఆవేదన చెందుతున్నారు.