బుజ్జాయి తప్పటడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు తెగ మురిసిపోతారు. పడుతూ లేస్తూ వస్తున్న పాపాయి చేయి పట్టుకుని నడిపిస్తారు. కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ పసిది పెరిగి పెద్దై తన తోడు వెతుక్కుంటే మాత్రం ఆ తల్లిదండ్రులు సహించలేరు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడో ఉత్తర భారతదేశంలో తల్లిదండ్రులకు ఇష్టం లేని కులం కానివారిని పెళ్లి చేసుకున్న కూతుర్లను పరువు పేరుతో హతమార్చే ఘటనలు వెలుగుచూసేవి. ప్రస్తుతం దక్షిణాదిలో మన తెలుగురాష్ట్రాల్లో ఈ రకమైన అమానుష కృత్యాలు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి.
2014 నుండి 2016 మధ్య కాలంలో దేశంలో 356 పరువు హత్యలు వెలుగుచూశాయని గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. 'చట్టం లేనందున చాలా కేసులు హత్య లేదా ఐపిసి ఇతర నిబంధనల కింద నమోదు చేస్తున్నారు. పరువు హత్యలుగా నమోదయ్యేవి చాలా తక్కువ. గౌరవం పేరుతో జరిగే ఈ హత్యలకు సంబంధించిన డేటాను సమగ్రంగా అథ్యయనం చేయాలి. జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రత్యేకమైన డేటాబేస్ రూపొందించా'లని 2014 నుండి పరువు హత్య' పేరుతో నమోదైన నేరాలపై అధ్యయనం చేస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొంటోంది.
పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు వారు కోరుకున్న భాగస్వామిని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? సాధారణంగా చిన్నప్పుడు పిల్లలు తమకి నచ్చనివాటి విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. ఉదాహరణకు 'నాకిది ఇష్టం లేదు.. నాకిది వదు'్ద అని నిర్మోహమాటంగా చెబుతుంటారు. అప్పుడు పెద్దలు కూడా వారి ఇష్టాయిష్టాలను గమనిస్తూ.. వారిని సంతోషపెట్టడానికే చూస్తారు. అదే పిల్లలు కాస్త పెద్దై కౌమారంలోకి వచ్చాక కూడా అదే ధోరణిలో ఉంటే మాత్రం చాలా మంది పెద్దలు వారిని నియంత్రించడానికి చూస్తారు. దండించైనా సరే వారిని దారిలోకి తేవాలనుకుంటారు.
- సమాజం.. ప్రభావం..
మనకు తెలియకుండానే సమాజ ప్రభావం మనమీద పడుతుంది. పిల్లల పెంపకం, చదువు, పెళ్లి వంటి విషయాలు సమాజ ధోరణికి అద్దం పట్టేలా ఉంటాయి. ఫలానా పిల్లలు ఫలానా స్కూల్లో చదువుతుంటే మన పిల్లలు కూడా ఆ స్కూల్లో చదివించాలని, స్థోమత ఉన్నా లేకున్నా అన్ని వసతులు కల్పించాలని ప్రతి తల్లిదండ్రీ కలలు కంటారు. నలుగురినీ చూసి ఆచరించడం, వారు చేసే పనులను అనుసరించడం సాధారణంగానే ఒక అలవాటుగా మారిపోతుంది. ఇలాంటి స్థితిలోనే ఒక వయసు వచ్చాక పిల్లలు ఎదురు తిరిగినప్పుడు పిల్లలను సరిగ్గా పెంచడం లేదని సమాజంలో తమ పరువు పోతుందని చాలా కంగారు పడిపోతాం. వారిని దారిలోకి తేవాలని తెగ ఆరాటపడిపోతాం. మాట వినని పిల్లలున్న తల్లిదండ్రులకు అదో పెద్ద ఆందోళన..
- నియంత్రించుకోలేని భావోద్వేగ స్థాయిలు
బాధ, సంతోషం, దు:ఖం, కష్టం మాదిరే.. ఒత్తిడి, బాధ్యత, ఆందోళన, నిరాశలు కూడా మనలో కలిగే రకరకాల భావోద్వేగాలు. పిల్లల పెంపకంలో ప్రతి తల్లీదండ్రీకీ అవన్నీ అనుభవంలోకి వచ్చేవే.. ఆ భావోద్వేగాలనే రకరకాల పద్ధతుల్లో పిల్లలపై వ్యక్తపరుస్తుంటారు. అలాంటి భావోద్వేగమే ప్రేమ పెళ్లి చేసుకున్న పిల్లలను అంగీకరించలేకపోవడం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా బయటపడుతుంది. చాలామందిలో పిల్లలు చేసుకున్న పెళ్లిళ్లు ఇష్టం లేనప్పుడు కుటుంబానికి వారికి దూరంగా పెట్టడం, వారికీ కుటుంబానికి సంబంధం లేదని తెగేసి చెప్పడం జరుగుతుంటుంది. పెళ్లి వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా తల్లిదండ్రులు భావించినప్పుడు జరిగే సాధారణ ఘటనలు ఇవి.. అదే వ్యవహారం సమాజానికి అనుసంధానం చేసుకున్న తల్లిదండ్రులు వారి భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. తమ పరువు తీసిందని, తలెత్తుకుని తిరగకుండా చేసిందని పగ పెంచుకుంటారు. అప్పటి వరకు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లను నరికి చంపడానికి కూడా వెనకాడటం లేదు. కన్నవారే కర్కశులుగా మారిన వైనాలు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి.
- వరుస ఘటనలు..
2023 జూన్ 16న కర్నూలు జిల్లా పెదకద్బూర్ మండలంలో ఒక కుటుంబంలో పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆమె బతికుండగానే శ్రాద్ధకర్మలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులను ఆహ్వానించి నిర్వహించిన ఆ కార్యక్రమాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. తెలంగాణలో కూడా ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది.

2019 అక్టోబరు నెల.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఇంటర్ చదువుతున్న కూతురు కులాంతర వివాహం చేసుకుందని తెలిసి కన్నతండ్రే ఆమెను ఉరి వేసి చంపాడు. పెళ్లి నాటికి కూతురు మైనర్ కావడంతో, ఏడాది తరువాత అత్తింటికి పంపిస్తానని నమ్మబలికి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఓ తాడుతో గొంతు చుట్టూ మెలిపెట్టి చంపేసి ఉరి వేసుకుందని చెప్పాడు. రాత్రికి రాత్రే శవాన్ని కాల్చేసి బూడిదను బస్తాల్లో కుక్కి ఓ మురికి కాల్వలో కలిపేశాడు!
2020 జూన్ నెల.. తెలంగాణ జోగులాంబ గద్వాల్ మండలంలో తమ కుమార్తె వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి, అతని బిడ్డకు తల్లి అవుతోందని తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఆ బిడ్డను హతమార్చారు. తల్లి, దిండుతో ముఖంపై అదిమి పెట్టగా.. తండ్రి, కూతురు మెడను తాడుతో మెలేశాడు. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ, ఊపిరాడక మరణించిన కూతురును అదే తాడుతో ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు ఆ తల్లీదండ్రీ.
2021 జనవరి 1న కర్నూలు జిల్లా ఆదోనిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై కొంతమంది వ్యక్తులు ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టి చంపారు. తన పుట్టింటి వారే ఈ దారుణానికి పాల్పడ్డారని అతని భార్య చెప్పింది. కారణం.. ఆమె వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే!
... ఇలా ఏడాదికేడాది ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాలో పెరిగిపోతున్నాయి. వెలుగుచూసిన ఘటనలు చాలా తక్కువ. ఉనికిలోకి రానివి చాలానే ఉన్నాయి. పరువు పోతుందని బిడ్డను చంపడమో.. ఆమె భర్తను హతమార్చడమో చేసేందుకు తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డలను ఇంత కిరాతకంగా చంపేంత కర్కశత్వం తల్లిదండ్రుల్లో ఎలా వస్తోంది?
కుల దురహంకార హత్యలివి : డి.రమాదేవి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి

.గతంలో మన రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు జరగలేదు. కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఆమె కుటుంబ సభ్యులు తనతో తెగతెంపులు చేసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఉత్తరాదిలో వేళ్లూనుకున్న ఈ తరహా హత్యలు చాపకింద నీరులా ఇక్కడికి కూడా వ్యాపించాయి. కూతురు కులాంతర వివాహం చేసుకుంటే పెత్తందార్లం అనుకునేవాళ్లు ఆమెనో.. ఆమె భాగస్వామినో చంపేదాకా ఊరుకోవడం లేదు. సమాజంలో కుల ఉన్మాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందోననడానికి ఇటువంటి ఘటనలే ఉదాహరణ. పరువు, గౌరవ హత్యలని వీటిని పిలవకూడదు.. కుల దురహంకార హత్యలుగా చూడాలి. దీనికి ప్రత్యేక చట్టం రావాలి. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.










