ఒడ్డున పడినా, ఎండిన చెఱువు అట్టడుగు పొరల్లో మట్టికొట్టుకుపోయినా, చైతన్యరహితమౌతుంది చేప. కవిత్వం కూడా అంతే! తేటనీటిలో మిలమిల మెరుస్తూ కదలాడే చేపలా కవిత పాఠకుణ్ణి ఆకర్షించాలి. అలాంటి మిలమిలల చేపల్ని పుస్తకాల ఎక్వేరియాల్లో పెట్టి ప్రదర్శించడం బాల సుధాకరమౌళికి అలవడిన విద్య. కేంద్ర సాహిత్య అకాడమీ యువసాహిత్య పురస్కారం పొందిన మౌళి ... నిరంతరం కవిత్వ శిఖరాన్నధిరోహిస్తూనే ఉన్నారు. ఏకకాలంలో రెండు మూడు పడవల ప్రయాణం లక్ష్యసాధనకు పనికిరాదన్న ఎరుకతో కవిత్వాన్ని మాత్రమే శ్వాసిస్తున్నారు. 2014 నుంచి 8 కావ్యాలను తీసుకొచ్చి ఈ 'అస్తిత్వవాచకం'ను 9వ సంపుటిగా ముద్రించుకున్నారు.
'కొత్త విలువల విత్తనాలను నాటి నీళ్ళు పోసి/ పెంచి పెద్ద చేద్దామనే ఇద్దరం ఒక గూటి పిట్టలయ్యాం' ఈ వాక్యంతో ప్రారంభించిన కావ్యంలో తొలి కొన్ని కవితలు తమ నూత్న దాంపత్యానికి చెందిన అనుభూతులు, ఆశలు, ఆశయాలతో నిండి ఉన్నాయి. ఆ తరువాత పిల్లలు, బడులు, ఆడపిల్లల సమస్యలు, సమాజం స్త్రీలు, అల్ప సంఖ్యాకుల మీద చేస్తున్న దౌర్జన్యాలపై రాశారు. ఆయా వర్గాలకు ధిక్కారాన్ని నేర్పారు. ఆ వరసలోనే 'ఒక విధ్వంస స్వరం' అనే కవితలో 'దున్నపోతు లాగ పొద్దెక్కిందాకా నీ ఇష్టానికి తొంగోని/ వొల్లు ఇరుసుకొని లెగిత్తే/ నీ మూతికాడికి గిన్ని అందించాలి రా/ లం కొడకా' అని ఇంటికొచ్చి హింసిస్తున్న భర్తను భరించలేని భార్య చేత దులిపిస్తారు. ఋతు బాధలపై సానుభూతి ప్రకటిస్తూ 'సమస్త స్త్రీల నెలసరి బాధని ఇంకించు కోవడానికి/ ఇప్పటికిప్పుడే స్త్రీగా మారిపోవాలనుంది పాపా!' అంటాడు 'ఇట్లు మీ నాన్న' కవిత ముగిస్తూ! 'అంతిమ పరిష్కారం' కవితలో 'బడంటే సున్నిత సుకుమార హృదయాల పిల్లలు మేల్కొనే అమ్మ ఒడి' అని భావిస్తాడు. 'చివరి అంకం'లో 'అరచేతుల్లో కుద్దురుగా ఒదిగి అమిరిన పుస్తకం/ అనాథ బేల చూపులు చూస్తోంది. ఏడున్నర ఇంచీల తెర విరగబడి విరగబడి నవ్వుతోంది' పిల్లల దృష్టి పుస్తకం మీది నుండి సెల్ ఫోన్ల మీదికి మరలే సన్నివేశాన్ని హృదయానికి దగ్గరగా రాశారు. 'మూలంలో లోపం ఉంది తల్లీ/ అది తెగినబల్లి తోకలా కదులుతుంది' ఈ 'అనేక రేవతిల కోసం' కవితలోని తెగిన బల్లితోక పోలిక అతి నవ్యం, అద్భుతం. 'కౌమారం పిట్టల మీద తప్పులు తేల్చి/ ఏహ్యత పెంచుకున్నంత కాలం/ నువ్ పిట్టల తరపునే మాట్లాడలేవు నిలబడలేవు/ వకాల్తా పుచ్చుకోలేవు' అంటూ కౌమారంలోని ఆశలను పెద్దలు గౌరవించాలని చెబుతారు.
'అస్తిత్వ వాచకం' కవిత ముగింపులో 'బతుకునే చెరిపేస్తానంటే/ నువ్వే గీతలు గీసినా చెరిపి తీరుతాను/ ఏ పీఠాలనైనా కూల్చే తీరుతాను' అని ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు తెగేసి. రాజ్య దౌర్జన్యాన్ని 'అబద్ధాల పుట్ట' కవితలో 'రక్షక దళాలనూ న్యాయస్థానాలనూ/ నీ ఇలాకాలో గుంజకు కట్టేసుకుని/ తూతూ నిజాలను జపిస్తే మాత్రం/ తప్పు ఒప్పైపోదు' అంటూ ధిక్కరాన్ని కొనసాగిస్తారు. 'ఎన్నికల చెట్టు వయసు డెబ్భై ఏళ్ళు/ ఇంకెంతకాలం పట్టుకు వేలాడతావో జవాబు చెప్పే/ చేవ నీకు లేదని తెలుస్తుంది' అని 'అహంకారం చెటు'్టలో వ్యక్తం చేస్తారు. 'మొహర్రం ఏ విజయనగరం'లో 'శాంతి కపోతం ఎగురుతుంది/ కాషాయం కక్ష కట్టిన కాలంలో / సంకెళ్ళ దేశంలో' అని మైనారిటీలకు సాంత్వన పలుకుతారు కవితాత్మకంగా. 'హృదయంలో తడి ఆరిన వాళ్ళంతా/ అక్కడ తిరిగి ప్రాణం పోసుకుని/ వొక్కొక్కరూ నదుల్లా ప్రవహిస్తూ' అని ఎల్లోరా గుహల్ని ప్రశంసిస్తారు. 'అతను రావడం రావడమే/ స్వేచ్ఛ అజరామరమని గొంతెత్తి లోకమంతా/ చాటింపు వేస్తాడు' ఇలా జి.ఎన్.సాయిబాబా మూర్తిని ప్రతిష్టిస్తారు రెండు కవితల్లో! ఆ వరుసలోనే గురువు శివారెడ్డి, జర్రా అప్పారావు, మేడిపల్లి రవికుమార్, తెలుగు వెంకటేష్‌ల ఘన వ్యక్తిత్వాలను చిత్రించారిందులో! కొత్త కొత్త ప్రతీకలతో, అభివ్యక్తులతో వ్యక్తీకరిస్తారు.
ఇదంతా తొలి భాగం అనుకుంటే, చివరి పది పన్నెండు కవితలూ, పదునెక్కిన తన కలాన్ని, తన నేలలోకి ముంచి రాసినవి. అక్కడినుండి వాన, నది, చెట్టు కలగలిపే నాల్గు కవితలు రాశారు. వాటిని అనుసరిస్తూ 'నా పేరు చంపావతి' అని ఓ కవిత. చంపావతి దాటి వెళ్ళాక 'మా ఊరి కవితలు' పేరన ఊరి జనాన్ని, వారి వృత్తుల్ని, శ్రమను, చెమటను రాశారు. అక్కడితో ఆగితే మౌళిని చెప్పుకోవడమెందుకు? ఊరసెరువు, ఇక్కప్ప, సుమ్మ, పాటల తాత, మా బతుకు, గోసి, సుట్ట అని మరో ఆరు రాసి ఉత్తరాంధ్ర యాసను ఉయ్యాల్లో పెట్టి ఊపేరు. ఇవన్నీ తాను నివసించే నెల్లిమర్లను ఆనుకొని ప్రవహిస్తున్న చంపావతి, దాని ఇరుగు పొరుగు గ్రామాల్లోని రైతులు, వారిపై ఆధారపడి బతికే బతుకుల శ్రమ. చెమట చిత్రణ అన్నమాట. మొత్తంగా ఒక నదీ ప్రాంతపు అస్తిత్వం అనేకంటే కళింగాంధ్ర అస్తిత్వ కెరటాలివి అనడం సబబు.
ఈ కవి ఉత్తరాంధ్ర యాసను ఎంతలా పిడికిలి పట్టాడో ఈ కవితల్లో మచ్చు చూద్దాం. 'ఊర సెరువు' కవితలో ''సలికాలం మాసెరువు/ కాలూ సేతులూ పొట్టలోకి ముడుసుకుని/ కూకున్న ముసిల్దానిలా ఉంది..', 'సూత్తే.. కళ్ళనిండా ఒకటే కన్నీలు.. తుడుసుకుందుమంటే కళ్ళు సెరువులు' ఈ పేరాల్లో వ్యక్తీకరణ అత్యాధునికం. పిడికిలి నిండా కళింగాంధ్ర యాసే! 'గోసి' కవితను ముగిస్తూ 'మా తూరుపు గెడకర్ర మీద/ రెపరెపల ఎగిరే అస్తిత్వపు జెండా/ మా గోసి!''- గోసిని కళింగాంధ్ర అస్తిత్వ జెండాగా ఎగరేస్తున్నారు.
'చలిపులి' అనేది ప్రబంధ కవుల భావన. దాన్ని అత్యాధునికంగా ఎలా ఉపయోగించుకున్నారో పొగచుట్ట వర్ణనలో! 'సలికాలమొత్తే సుట్టే మా ఊరిల బడిన/ సలి పులిని పొలిమేరలకు తగిలీసే దివిటీ' అంటారు. అదే సుట్ట కవితలో 'కమ్మకత్తంచులాటి మంచి నిగనిగల మజ్జానం' అంటారు. మధ్యాహ్నం ఎండ కమ్మకత్తి అంచులా తళతళలాడుతూ, తీవ్రంగా, దొరికితే పీక కోసేస్తానన్నట్టుందట! పోలిక కత్తి కదా!
ఈపాటికే ఈ చివరి కవితల్లో కళింగాంధ్ర రైతు కూలీల, శ్రామికుల సజీవ భాషను కవితలకొద్దీ ఒంపడాన్ని చదువుకున్నాం. విడిగా ఇక్కడి పలుకుబళ్ళు, నానుడులను చూద్దాం. నొల్లచెక్క (102), కారిపొలం (118), నిగడదన్ని, ఈడిసలు- ఇలిసిలు, కటిక్కర్ర (120), సెయిబారు కత, పదారేల గుంట 121), ఇద్దులాట (122), యాదస్తు, ఆదరువు, మునకాల (124), బొట్టి (127), అడ్డపొగ (130) ఈ చివరి రెండూ కళింగాంధ్ర యాసకు రెండు భుజకీర్తులు.
అంతేకాదు పైడితల్లి మామ (115), గొల్ల కిష్ట, బారికి అప్పన్న, నెయ్యిల పాపన్న (117) పైడీలు పెనిమిటి (118) ఇసరాపు ఇక్కప్ప (121) అచ్చియ్య తాత (127), కొట్టేడ పైడితల్లి, సిరప నరసమ్మ, సేపేని తమ్మయ్య (130), కునుకోల అప్పలసోమి (131) ... ఇలా మనం ఆ కవితలెంట నడుస్తుంటే అడుగడుగునా తారసపడే ఉత్తరాంధ్ర పల్లెజనం. వీళ్ళందరి సావాసంతోటే మౌళి ఈ అస్తిత్వ వాచకం మనముందు పెట్టగలిగేరు. కాదంటారా?
కన్నీళ్ళకు బదులు ఏడుపు నీళ్ళు (126) అనే కొత్త పదాన్ని సృష్టించారు. ఆమోదయోగ్యమైన పద సృష్టి భాషావేత్తలే చెయ్యగలరు. 'ఇలాకాల రాసిపెట్టుకున్న శిలాఫలకవాక్యం' అని 'తదుపరి హక్కు' కవితలోని వాక్యం అనుకోని శబ్ద సౌందర్యాన్నిస్తోంది కదూ! 'ఈ లోకానికి మోక్షంలేదు పాపా' (28)- మోక్షం ఉందా? గత తరం అంటించిన మోక్షాన్ని ఈతరం నవ్య కవులూ వదిలించుకోకపోవడం విడ్డూరం.
కవితా రచనలోను, పుస్తక ముద్రణలోనూ నూతనత్వాన్ని సాధించాలనే తపన ఉన్న బాలసుధాకర మౌళి ఈ కావ్యానికి తాను ముందుమాటలు రాసుకోలేదు. లబ్ధప్రతిష్ఠులైన ఇతరుల అభిప్రాయాలనూ పెట్టలేదు. అదంతా దాటివచ్చిన సంప్రదాయంగా భావించి ఉంటారు. అందమైన 55 కవితలతో, అట్ట ముందూ వెనుకా అంతా తానేగా ఈ పుస్తకంలో పొడకడతారు మౌళి.
కొత్త కొత్త వస్తుసముదాయాన్ని ఎంచుకొని, నవ్య దృక్పథంతో, నూత్నమైన అభివ్యక్తితో, నిరంతర తపనతో కవిత్వాన్నే రాస్తూ, చెయ్యి తిరిగిన రచయితగా మౌళి నిర్మితుడౌతున్నారు. తన దృష్టినంతా సమాజం వైపే సారిస్తూ, అన్యాయాలను, ఘోరాలను, రాజ్యహింసనూ ధిక్కరిస్తూ రాస్తున్నారు. యువకవు లెందరున్నప్పటికీ కళింగాంధ్ర అస్తిత్వం నేపథ్యంగా కొత్త దారుల్లో పయనిస్తున్న బాల సుధాకర మౌళి మున్ముందు గొప్ప లక్ష్యాన్ని చేరుకోగలరని ఈ కావ్యం చెబుతోంది. అస్తిత్వ వాచకం, బాలసుధాకర మౌళి, పుటలు- 134, వెల- రూ.150. దొరకు చోటు : 96764 93680
- గార రంగనాథం
98857 58123










