
న్యూఢిల్లీ : వారణాసిలో జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. రక్షణను కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే నెలలో జారీ చేసిన ఆదేశాలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మే నెలలో వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ ప్రార్థనా స్థలంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి అనుమతినిచ్చింది. అయితే ఈ కేసుపై వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.