
ఢిల్లీ: భారత్ నిర్వహిస్తోన్న జీ20 సదస్సు వేళ.. శనివారం రాత్రి అతిథులకు రాష్ట్రపతి విందు ఇస్తున్నారు. దీనికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది. వారిలో పలువురు సీఎంలు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా విందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. దాంతో ఆయన శనివారం హాజరుకావాల్సిన ఈడీ విచారణకు డుమ్మా కొట్టనున్నట్లు కనిపిస్తోంది.
మనీలాండరింగ్ కేసులో సోరెన్ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆగస్టు 14, ఆగస్టు 24 తేదీల్లో ఆయను గైర్హాజరయ్యారు. దాంతో సెప్టెంబర్ 9న రాంచిలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే జీ20 సదస్సు నేపథ్యంలో ఈ రోజు రాత్రి రాష్ట్రపతి విందు ఇస్తున్నారు. ఆ నిమిత్తం సోరెన్ దిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దాంతో ఇప్పుడు ఆయన ఈ విచారణకు హాజరుకావడం తెలుస్తోంది. ఇదివరకు అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సోరెన్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.