మనీలాండరింగ్ కేసులో ఇడి నిర్ణయం
ఐదుగురిపై చార్జ్‌షీట్
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జప్తు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబారు సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 వాణిజ్య ఫ్లాట్‌లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఇడి వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంక్షోభంతో 2019లో మూత పడిన జెట్ ఎయిర్‌వేస్.. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో నరేష్ గోయల్‌ను ఇడి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశారని ప్రధాన అరోపణ. జెట్ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను వ్యక్తిగత అవసరాలకు, ప్రయివేటు రుణాలు తీర్చేందుకు వినియోగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో నరేష్ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 26 ఏళ్ల పాటు జెట్ ఎయిర్‌వేస్ పౌర విమానయాన సేవల రంగంలో ఉంది. నిధుల మళ్లింపు, ఆర్థిక సంక్షోభంతో ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేస్తూ.. దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.