Mar 13,2023 08:03

ఆకాశాన్ని నేలమట్టం చేసే ఆయుధాలు
ధగ ధగా మెరుస్తున్నారు
గింజలు ముక్కున కరిచి ఎగిరేంతలో
ఆకలిని లుప్తం చేసేసిన పొగ చారల మధ్య
తెగిపడ్డ పిట్టల గుండెలు
గింజుకులాడుతున్నారు

వ్యవసాయ క్షేత్రంగా మనలేని పొలాలన్నీ
యుద్ధ క్షేత్రంగా మారక తప్పదని
చావులో.. బతుకు అనివార్యతేమిటో
కాలిబూడిదైన కంకులు బోధిస్తున్నారు

బిడ్డలు కావాలని చీమలు పెట్టిన గుడ్లు
బాంబుల సెగల్లో పేలిపోగానే
అవిటి చీమల చీము నెత్తురు కెరటాల్లోంచి..
పిగిలినగుడ్ల మండే గుండెసొనల్లోంచి..
పుట్టలు పుట్టలుగా డ్రోన్లు పుట్టుకొస్తున్నారు

సరిహద్దుల కనురెప్పల మీద కంపించి కంపించీ
తనను తాను నిభాయించుకోలేక
రెప్పపాటు విరామాల్లో
బూడిద గుట్టల మీద తేట పడుతోంది గాలి!

కన్నీరు మున్నీరుగా పొగిలే మట్టిబెడ్డల గుండెపై
నెత్తుటి తలగడ మీద తలవాల్చి
శవ పేటికల చుట్టూ పూడ్చిన సంతాప
దుక్కుల్ని శ్వాసిస్తోంది నేల!

పచ్చగడ్డి గమనించకపోలేదు దు:ఖపాతాన్ని -
ప్రతి పిడుగుపాటుకూ
మోకాళ్ళ మీద కూలబడి
కాస్తంత శక్తి కూడదీసుకుని నిటారుగా లేచి
నిప్పుల దండుకు ఎదురు నిలిచే
సరికొత్త వ్యూహాన్ని మోహరిస్తోంది

కాలు దువ్వడానికైనా.. కాచుకోవడానికైనా..
హేతువు దొరికి తీరుతుంది!
దొరకనిదల్లా,
రెప్ప మూయడం మరిచిన దేహాల మీద
నెత్తీనోరూ మొత్తుకుని రోదించే
లేచివుళ్లు పండుటాకుల భీతి గుండెల శోకాన్ని
అచ్చంగా కొలిచే తూనిక రాళ్ళే!
యుద్ధం -
ప్రతి ప్రాణం పిట్ట కంటి నుంచి జారే
జేగురు రంగు కన్నీటి బొట్టు
యుద్ధం -
మానవాశల పూల సమాధి పక్కనే
తెరుచుకునే సరికొత్త 'సార్కోఫాగస్‌' దుకాణం!
యుద్ధం -
భూగోళాన్ని కాజేసే ఒక పాత వాణిజ్య వ్యూహం!
యుద్ధాన్ని ఓడించడం
యుద్ధోన్మాదుల్ని జయించడం
మూడో సహస్రాబ్దికిపుడు మొట్ట మొదటి బాధ్యత!
 

- కంచరాన భుజంగరావు
94415 89602